2025లో జనగణనకు సిద్ధమౌతున్న కేంద్రం
2025లో జనగణన.. 2028లో నియోజకవర్గాల పునర్విభజనపేర్కొన్న ప్రభుత్వ వర్గాలు
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమౌతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమౌతుందని, అది 2028 కి ముగుస్తుందని వెల్డించాయి.
ప్రతి పదేళ్లకొకసారి ఆనవాయితీగా నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. రాష్ట్రాల వారీగా, జాతీయస్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడానికి ఈ జనగణనే కీలకం. కొవిడ్ సంక్షోభంతో 2021 సెన్సస్‌కు ప్రతిబంధకంగా మారింది. తర్వాత ఈ ప్రక్రియ వాయిదా పడుతున్నది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొన్ని నెలల కిందట మాట్లాడుతూ.. తగిన సమయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తాం. దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా జరుగుతుందో నేను ప్రకటిస్తాను. ఈ సారి పూర్తిగా డిజిటల్ విధానంలో ఈ సర్వే ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఇప్పటికీ 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బైటపడ్డారన్న నీతి ఆయోగ్ లెక్కలపై సామాజికవేత్తలు మండిపడ్డారు. సరైన లెక్కలు లేకుండా ఈ ప్రకటన చేయడంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశం కూడా దీనితో ముడి పడి ఉండటంతో విపక్షాల నుంచి ఒత్తి వస్తున్నది. మరోవైపు కులగణన నుంచి ప్రతిపక్షాల నుంచి చాలా డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జనగణనపై వార్తలు రావడం గమనార్హం. అయితే దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది.