తప్పు ఆమెదే అంటారా? కోల్‌కతా హత్యాచార ఘటనపై సెలీనా జైట్లీ ఆసక్తికర పోస్ట్‌

అత్యాచారాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలకు చెబుతారే కానీ, అలా చేయవద్దని అబ్బాయిలకు మాత్రం ఎవరూ చెప్పని సమాజంలో మనం బతుకుతున్నామని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-08-19 10:44 IST

కోల్‌కతా మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్ట‌ర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనపై ప్రముఖ బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘ఎక్స్‌’ వేదికగా ఆమె చేసిన పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోల్‌కతా ఘటన నేపథ్యంలో సెలీనా జైట్లీ తన మనసులో గూడుకట్టుకొని ఉన్న పీడకల లాంటి బాల్య జ్ఞాపకాలను ‘ఎక్స్‌’ వేదికగా ఆవిష్కరించారు. తన బాల్యంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.

స్కూలులో ఆరో తరగతి చదువుకునే రోజుల నుంచే అబ్బాయిలు పలుమార్లు తనను వేధించారని సెలీనా పేర్కొన్నారు. దానిపై టీచర్లకు చెబితే.. తననే తప్పు పట్టేవారని ఆమె తెలిపారు. తమ స్కూలుకు సమీపంలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు రిక్షాలో వెళుతున్న తన వెంటపడుతూ అల్లరి చేసేవారని, తనపై గులకరాళ్లు విసిరేవారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం ఒకరోజు తమ టీచరుకు చెప్పగా.. తననే తప్పుబట్టారని తెలిపారు. తన వస్త్రధారణ మరీ పాశ్చాత్య ధోరణిలో ఉంటుందని, వదులు దుస్తులు ధరించి, తలకు నూనె పెట్టుకొని రెండు జడలు వేసుకోవచ్చుగా. ఇది నీ తప్పే.. అంటూ తననే తప్పుబట్టారని వివరించారు.


ఇలాంటి ఘటనలు చాలాకాలం ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. తాను 11వ తరగతిలో ఉన్న సమయంలో వేధింపుల విషయాన్ని మళ్లీ టీచర్‌ దృష్టికి తీసుకెళ్లానని, అప్పుడూ తననే తప్పుబట్టారని వివరించారు. ’నువ్వు మోడరన్‌ టైపు అమ్మాయివి. జీన్స్‌ తొడుగుతావు. స్కూటీ నడుపుతావు. జుట్టు కత్తిరించి వదులుగా వదిలేస్తావు. దీంతో నీది లూజ్‌ క్యారక్టర్‌ అని అబ్బాయిలు అనుకుంటున్నారు’ అంటూ టీచర్‌ తననే నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యాచారాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలకు చెబుతారే కానీ, అలా చేయవద్దని అబ్బాయిలకు మాత్రం ఎవరూ చెప్పని సమాజంలో మనం బతుకుతున్నామని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలైన మనం తప్పు చేయలేదని ధైర్యంగా నిలబడి, మన రక్షణ హక్కు కోసం గళమెత్తాల్సిన తరుణమిదే అని ఆమె పిలుపునిచ్చారు. తాను ఆరో తరగతి చదువుతున్నప్పటి ఫొటోను ఈ పోస్టుకు జత చేయడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News