వాజ్‌పేయీకి నివాళులు అర్పించిన ప్రముఖులు
నివాళులు అర్పించిన వారిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సహా ప్రముఖులు
మాజీ ప్రధాని వాజ్‌పేయీ శతజయంతి సందర్భంగా ఢిల్లీలోని 'సదైవ్ అటల్' వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు , పలువురు ఎంపీలు వాజ్‌పేయీకి అంజలి ఘటించారు.
రాజనీతిజ్ఞుడుగా ఉన్నతస్థాయిలో నిలిచారు: మోడీ
వాజ్‌పేయ్ రాజనీతిజ్ఞుడుగా ఉన్నతస్థాయిలో నిలిచారని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వివరించారు. అసంఖ్యాక ప్రజలకు వాజ్‌పేయీ స్ఫూర్తినిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ రూపశిల్పి అటల్‌జీకి దేశం ఎళ్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందున్నారు. వాజ్‌పేయీ హయాంలో ఐటీ, టెలికాం, కమ్యూనికేషన్ రంగాల్లో దేశం పెద్ద ముందడుగు వేసిందని ప్రధాని గుర్తు చేశారు. అటల్ జీ ప్రభుత్వం సాంకేతితను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. యావత్ భారతదేశాన్ని రహదారులతో అనుసంధానించడంలో ఆయన కృషి అపారమైనదని మోదీ పేర్కొన్నారు.
భారతజాతి గర్వించదగిన నేత:చంద్రబాబు
వాజ్‌పేయీ దూరదృష్టి వల్లనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వాజ్‌పేయీ జయంతి సందర్బంగా 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు. భారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయీ. ఆయన దూరదృష్టి వల్లనే నేడు మన దేశం ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నది. దేశం గురించి ఆలోచించే తీరు విలక్షణమైనది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్‌పేయీ స్పందించిన తీరు ఎన్నటికీ మరిచిపోలేను. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు.