నో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాడ్స్.. సెలబ్రిటీలకు సీసీపీఏ హెచ్చరిక
పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లు పూర్తిగా నిషేధం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదు
జూదమాడాలనుకునే యువతకు ఇప్పుడు చేతిలో సెల్‌ఫోనే పెద్ద జూదశాల. వందల కొద్దీ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లు రారమ్మంటూ ఆహ్వానిస్తుంటాయి. లూడో ఆడుతూ లక్షలు సంపాదించొచ్చు, తీన్ పత్తీతో మీరు కరోడ్‌పతి అయిపోవచ్చు లాంటి ప్రకటనలతో సెలబ్రిటీలు యువతను పెడదోవ పట్టిస్తున్నారని చాలాకాలంగా తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సెలబ్రిటీలు ఎవరూ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాడ్స్‌లో నటించవద్దని సెంట్రల్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సూచించింది. వీటికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ బ్యాన్
పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లు పూర్తిగా నిషేధం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదు. దీంతో రాష్ట్రాలే ఎక్కడికక్కడ వాటిపై నిషేధం విధిస్తుంటాయి. అయితే ఆన్‌లైన్‌లో యాప్స్‌లో ఈ జూదాలాడుతుండటంతో వాటిని నియంత్రించడం కష్టంగా మారుతోంది. రమ్మీ, తీన్‌పత్తీ లాంటి జూదక్రీడలే కాదు, క్రికెట్ వంటి ఆటల ఆధారంగా వందల కొద్దీ బెట్టింగ్ యాప్‌లున్నాయి. వీటన్నింటినీ సెలబ్రిటీ తారలు, క్రికెటర్లే ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్, గ్యాంబ్లింగే కాదు చట్టపరంగా నిషేధించిన ఏ ఇతర కార్యకలాపాలకు సంబంధించిన వాటినీ ప్రచారం చేయవద్దని సీసీపీఏ గట్టిగా హెచ్చరించింది.
సినీతారలు, క్రికెటర్లే ప్రచార తారలు
ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్‌కు ప్రధాన ప్రచారకర్తలు చాలామంది ఫేమస్ క్రికెటర్లు, సినిమా స్టార్లే. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని ఆ యాడ్స్‌లో నటిస్తున్న తారలు వాటి వల్ల యువత పెడదోవ పట్టి అప్పులు చేసి ఆత్మహత్యల వరకు వెళ్లిపోతున్నారని తెలిసీ మిన్నకుండిపోతున్నారు. వారికి సామాజిక బాధ్యత లేదా అని ఎన్ని విమర్శలొచ్చినా కళ్ల మందు కనిపిస్తున్న కోట్లకే వారు విలువిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీసీపీఏ హెచ్చరికలతోనైనా వారికి కనువిప్పు కలగాలి.