యూపీలో ఢిల్లీ సీన్.. వ్యక్తి మృతదేహాన్ని పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

ఢిల్లీకి చెందిన వీరేందర్ సింగ్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కారులో ఆగ్రా నుంచి నోయిడాకు బయలుదేరాడు. ఆ కారు యమునా ఎక్స్ ప్రెస్ వే ఉన్న టోల్ బూత్ వద్దకు వచ్చిన తర్వాత కారు కింద మృతదేహం చిక్కుకున్నట్లు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు

Advertisement
Update:2023-02-07 20:30 IST

ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో జరిగిన ఘోర ప్రమాద సంఘటన ఎప్పటికీ మరచిపోలేం. బైక్ పై వెళ్తున్న ఒక యువతిని కారు ఢీకొని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతి మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. ఇప్పుడు అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో జరిగింది. ఒక వ్యక్తి మృతదేహాన్ని కారు పది కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.

ఢిల్లీకి చెందిన వీరేందర్ సింగ్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కారులో ఆగ్రా నుంచి నోయిడాకు బయలుదేరాడు. ఆ కారు యమునా ఎక్స్ ప్రెస్ వే ఉన్న టోల్ బూత్ వద్దకు వచ్చిన తర్వాత కారు కింద మృతదేహం చిక్కుకున్నట్లు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు.

అయితే అరెస్టు అయిన వ్యక్తి మాత్రం తాను ఎవరినీ ఢీ కొట్టలేదని పోలీసులకు చెబుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి నుంచి దట్టమైన పొగ మంచు కురుస్తోందని, తనకంటే ముందు వెళ్లిన వాహనాలు ప్రమాదానికి కారణం అయి ఉంటాయని, మృతదేహం తాను ప్రయాణిస్తున్న వాహనానికి తగులుకొని ఉండొచ్చని వీరేందర్ సింగ్ వాదిస్తున్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ త్రిగుణ్ బైసెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎవరు అన్నది ఇంకా నిర్ధారించలేదని, అతడు ఎలా చనిపోయాడో గుర్తించేందుకు ఆగ్రా - నోయిడా మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు పూర్తయితే గానీ వీరేందర్ సింగే ప్రమాదానికి కారకుడా, లేకపోతే మరెవరో చేశారా అన్నది తెలియనుంది.

Tags:    
Advertisement

Similar News