దేశంలో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. 10న పోలింగ్‌

నామినేషన్ల ప్రక్రియ జూన్‌ 21తో ముగిసింది. జూన్‌ 26తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక పోలింగ్‌ అనంతరం జూలై 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.

Advertisement
Update:2024-07-07 09:14 IST

దేశంలోని మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మొత్తం 7 రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎల‌క్ష‌న్ కమిషన్‌ ఈ ఎన్నికలు నిర్వహించనుంది. వాటిలో పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్‌ ప్రదేశ్‌లో 3. ఉత్తరాఖండ్‌లో 2, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు సంబంధించి జూన్‌ 14న నోటిఫికేషన్‌ విడుదల కాగా, నామినేషన్ల ప్రక్రియ జూన్‌ 21తో ముగిసింది. జూన్‌ 26తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక పోలింగ్‌ అనంతరం జూలై 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యేల మరణం, వివిధ పార్టీలకు నేతలు రాజీనామాలు చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని 3 అసెంబ్లీ స్థానాలైన రాయ్‌ గంజ్, రణఘాట్‌ సౌత్, బాగ్దాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి చేరి.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక మానిక్తలా నియోజకవర్గ టీఎంసీ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ ఎన్నికల్లోనూ కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలివే..

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానాల వివరాలిలా ఉన్నాయి. బిహార్‌లో రూపాలీ, పశ్చిమ బెంగాల్‌లో రాయ్‌గంజ్, రణఘాట్‌ సౌత్, బాగ్దా, మానిక్తలా, హిమాచల్‌ ప్రదేశ్‌లో డెహ్రా, హమీర్‌పూర్, నలాగర్, ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్, మంగ్లార్, తమిళనాడులో విక్రవాండి, మధ్యప్రదేశ్‌లో అమర్వారా, పంజాబ్‌లో జలంధర్‌ వెస్ట్‌ ఇందులో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News