నవంబర్ 3న ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు అసెంబ్లీ ఉప ఎన్నికలు
ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నగారా మోగింది. ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం సోమవారంనాడు ప్రకటించింది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు), హర్యానాలోని అడంపూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అక్టోబరు 7న విడుదల కానుండగా, ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి రానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 14. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 15న, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17 చివరి తేదీ.
భారత ఎన్నికల సంఘం ప్రకారం, ఈ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవిఎంలు) ఉపయోగిస్తారని, తగిన సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) అందుబాటులో ఉంచామని ఈసీఐ కార్యదర్శి సంజీవ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ యంత్రాల సహాయంతో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.