బుల్‌డోజర్‌లు సమస్యలకుపరిష్కారం కాదు': అధికారులపై బొంబే హైకోర్టు ఆగ్రహం

ముంబైలోని పశ్చిమ రైల్వే భూముల్లో అక్రమంగా ఉన్న 101 ఆస్తులను కూల్చివేసేందుకు అధికారులు చేపట్టిన కూల్చివేత డ్రైవ్ పై జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Advertisement
Update:2023-02-14 21:33 IST

ఆక్రమణలకు గురైన స్థలాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రజలను "ఆక్రమణదారులు"గా పేర్కొనడం సరికాదని, బుల్డోజర్లతో ఇళ్ళు కూల్చివేతల డ్రైవ్‌ల కారణంగా నిర్వాసితులయ్యే ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అందనిది అని బాంబే హైకోర్టు పేర్కొంది.

లైవ్‌లా ప్రకారం, ముంబైలోని పశ్చిమ రైల్వే భూముల్లో అక్రమంగా ఉన్న 101 ఆస్తులను కూల్చివేసేందుకు అధికారులు చేపట్టిన కూల్చివేత డ్రైవ్ పై జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి సర్వే లేకుండానే, పబ్లిక్ ప్రిమిసెస్ (అనధికారిక ఆక్రమణల తొలగింపు) ఆక్ట్, 1971 ప్రకారం సంబంధిత వ్యక్తులకు అవసరమైన నోటీసులు కూడా అందించకుండా డ్రైవ్ నిర్వహించారని కోర్టు పేర్కొంది.

సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి తదుపరి కూల్చివేతలు చేపట్టవద్దని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

"మొత్తం, అక్కడున్న‌ వ్యక్తులందరిపై 'ఆక్రమణదారులు' అని లేబుల్ వేయడం సమస్యకు సమాధానం ఇవ్వదని గుర్తుంచుకోవాలి. ఇది నగరంలో తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. ఇది మానవ నిర్వాసిత‌ సమస్య. కొన్నిసార్లు, నిర్వాసిత సమస్య‌ ఊహకు మించినది. కేవలం సైట్‌లో బుల్‌డోజర్‌లను మోహరించడం, ఇళ్ళు కూల్చేయడం కంటే ఇది మరింత సరైన‌ పద్ధతిలో పరిష్కరించాలి, ”అని ధర్నాసనం పేర్కొంది.

ఏక్తా వెల్ఫేర్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ కోర్టు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పిఎంఎవైఎస్) కింద పునరావాస ప్యాకేజీని ‍ నిర్వాసితులకు అధికారులు ప్రకటించలేదని బెంచ్ పేర్కొంది.

కూల్చివేతల నుండి ఉత్పన్నమయ్యే చెత్తను పారవేసేందుకు అనుసరిస్తున్న విధానంపై కూడా కోర్టు అధికారులను నిలదీసింది. లోతట్టు ప్రాంతాలలో చెత్తాచెదారాన్ని పడేస్తే దానంతటదే అరేబియా సముద్రంలో కొట్టుకుపోతుందనే అధికారుల ఆలోచన కూడా తాము ఆమోదించబోమ‌ని పేర్కొంది.

ఈ అంశంపై తదుపరి విచారణ మార్చి 1న జరగనుంది.

Tags:    
Advertisement

Similar News