22 వేల చెట్ల నరికివేతకు బాంబే హైకోర్టు అనుమతి
మహారాష్ట్రలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అడ్డంకి తొలగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అడ్డుగా ఉండే 22 వేల చెట్ల నరికివేతకు బాంబే హైకోర్టు అనుమతించింది. నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్ల మొక్కలను నాటుతామని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది.
మహారాష్ట్రలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేత అంశంపై గత నాలుగేళ్లుగా న్యాయస్థానంలో వాద ప్రతివాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఈ వివాదానికి శుక్రవారంతో తెరపడింది. ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణానికి మధ్యలో 50 వేలకు పైగా చెట్లు అడ్గుగా ఉన్నాయని గుర్తించిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ 2018లోనే కోఆర్డినేట్ బెంచ్‌ని దీని కోసం అనుమతులు కోరింది. ఇందుకు ఒప్పుకునేది లేదని అప్పట్లో బెంచ్ తేల్చి చెప్పింది. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి.. దీనిపై బాంబే హైకోర్టును సంప్రదించాలని సూచించింది.
దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్.. గతంలో తాము 50 వేలకు పైగా చెట్లను నరికేందుకు అనుమతి కోరామని, అయితే ఇప్పుడు ఆ సంఖ్య 22 వేలకు తగ్గించామని ధర్మాసనానికి విన్నవించింది. అంతేగాకుండా నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్ల మొక్కలను నాటుతామని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులూ పొందామని, చెట్ల నరికివేత ఒక్కటే తమ ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉందని తన వాదనలు వినిపించింది.
ఈ నేపథ్యంలో ముంబై పర్యావరణ పరిరక్షణకు చెందిన ఓ ఎన్‌జీవో సంస్థ చెట్ల నరికివేత వల్ల పర్యావరణానికి ఏర్పడే ప్రమాదాన్ని అంచనా వేయడం కష్టమంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎలాంటి పేలుళ్లూ చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బాంబే హైకోర్టు షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది. డిసెంబర్ ఒకటో తేదీన రిజర్వు చేసిన ఈ తీర్పును శుక్రవారం నాడు వెల్లడించింది.