హిందూ ఓట్లు కావాలా..? ఉదయనిధిని తిట్టేసెయ్..
ఎన్నికల వేళ ఉదయనిధి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది బీజేపీ. అందుకే ఆయన్ను తిడుతూ చోటామోటా నేతలు కూడా హైలైట్ అవుతున్నారు. కేంద్ర మంత్రులది కూడా ఇదే ఫార్ములా.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం బీజేపీకి అనుకూలంగా మారింది. ఏ రాష్ట్రంలో ఏ ప్రచార సభలో అయినా ఇదే వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నారు నాయకులు. రాజస్థాన్ ఎన్నికలకు, తమిళనాడులో ఉదయనిధి వ్యాఖ్యలకు అసలు సంబంధం ఏముంది..? కానీ అక్కడ కూడా ఆయన్ను తిడుతూ ఓట్లు అడుగుతున్నారు నేతలు. కేంద్ర మంత్రులు సైతం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలని అన్నారాయన. అలాంటి వారి కనుగుడ్లు పీకేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేంద్ర మంత్రిగా ఉన్న నాయకులు ఇలా నాలుక చీరేయాలని, కనుగుడ్లు పీకేయాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నాయి ప్రతిపక్షాలు.
అవకాశం కోసం బీజేపీ..
ఎన్నికల వేళ ఉదయనిధి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది బీజేపీ. అందుకే ఆయన్ను తిడుతూ చోటామోటా నేతలు కూడా హైలైట్ అవుతున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేది తామేనంటూ చెప్పుకుంటున్నారు, హిందూ ఓట్లకు గేలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సనాతన ధర్మంలోని తప్పుల్ని ఉదయనిధి ఎత్తి చూపితే, హిందూ మతానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్టు విపరీత అర్థాలు తీయడం సరికాదని డీఎంకే నేతలంటున్నారు.