కరువు నిధుల అభ్యర్థనకు వెళ్తూ.. లగ్జరీ ఫ్లైట్‌లో ప్రయాణమా..?

కేంద్రం నుంచి కరువు సహాయక నిధులు అడిగేందుకోసం ఢిల్లీకి వెళ్తూ లగ్జరీ విమానంలో ప్రయాణించడం విడ్డూరం. ఇది మన ఆర్థిక పరిస్థితిని అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది. ప్రజల సొమ్మును ఖర్చు చేయడం కాంగ్రెస్ మంత్రులకు చాలా సులభం' అని విజయేంద్ర ట్వీట్ చేశారు.

Advertisement
Update:2023-12-22 18:59 IST

ఒకపక్క కర్ణాటక రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రైవేట్ జెట్‌లో విహరిస్తూ ప్రభుత్వ నిధులు వృథా చేస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, కృష్ణ బైరే గౌడ ఓ లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. 'రాష్ట్రం మొత్తం తీవ్ర కరువుతో అల్లాడుతోంది. వర్షాలు కురవక పంటలు ఎండి రైతులు నష్టపోయారు. నిధుల్లేక అభివృద్ధి పనులు కూడా ఆగిపోయాయి. కర్ణాటకలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నారు.

కేంద్రం నుంచి కరువు సహాయక నిధులు అడిగేందుకోసం ఢిల్లీకి వెళ్తూ లగ్జరీ విమానంలో ప్రయాణించడం విడ్డూరం. ఇది మన ఆర్థిక పరిస్థితిని అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది. ప్రజల సొమ్మును ఖర్చు చేయడం కాంగ్రెస్ మంత్రులకు చాలా సులభం' అని విజయేంద్ర ట్వీట్ చేశారు.

కాగా, తనపై వచ్చిన విమర్శలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రయాణిస్తారు..? ఎటువంటి విమానంలో రాకపోకలు సాగిస్తారు..? అన్న ప్రశ్నలను బీజేపీ నాయకులను అడగాలంటూ మీడియాకు సూచించారు. బీజేపీ నాయకులు పదే పదే పనికిరాని వాదనలు చేస్తుంటారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News