బ్యాంకుకి 2వేల నోటు తీసుకెళ్తే ట్రాక్ చేస్తారా..?
2వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినా, మార్పిడి చేసినా వారిపై నిఘా పెట్టాలంటున్నారు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. 2వేల నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయాలంటున్నారు.
2వేల నోటుని ఉపసంహరించుకునే క్రమంలో.. సెప్టెంబర్ 30వరకు వాటి మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. అయితే కొన్ని కండిషన్లు పెట్టింది. ఒకరోజు ఒకరు 20వేల రూపాయల విలువ మేరకే 2వేల రూపాయల నోట్లను మార్చుకునే అవకాశముంది. బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎలాంటి నియమాలు లేవు. డిపాజిట్ కి అయినా, మార్పిడికి అయినా సెప్టెంబర్ 30 డెడ్ లైన్. ఆ తర్వాత 2వేల నోట్లను బ్యాంకులు తీసుకోవు. అయితే ఇన్ని కండిషన్ల మధ్య కూడా ఇప్పుడు ప్రజలను భయపెట్టే మరో అనుమానం తెరపైకి వచ్చింది.
2వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినా, మార్పిడి చేసినా వారిపై నిఘా పెట్టాలంటున్నారు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. 2వేల నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయాలంటున్నారు. ఈమేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఓ లేఖ రాశారు. తమిళనాడులో రూ.2000 నోట్లను మార్పిడి చేసేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన రూ.2000 నోట్లను మార్చుకునేందుకు డీఎంకే.. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. తమిళనాడులో జరిగే లావాదేవీలన్నిటినీ ట్రాక్ చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రత్యేకించి, సహకార బ్యాంకులు, సొసైటీల లావాదేవీలను ట్రాక్ చేయాలని కోరారు అన్నామలై. తమిళనాడు ప్రజల తరపున తాను కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతున్నట్టుగా లేఖ రాశారాయన.
అన్నామలై టార్గెట్ డీఎంకే అయినా.. దేశంలో 2వేల నోట్లు కలిగి ఉన్నవారంతా అక్రమార్కులే అనే అర్థం వచ్చేట్టుగా ఆయన వ్యాఖ్యలున్నాయి. 2వేల నోట్ల లావేదేవీలను ట్రాక్ చేస్తున్నారనే అనుమానం సామాన్యుల్లో వస్తే వారు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లడానికి భయపడతారు. హఠాత్తుగా నోట్లు రద్దు చేసి, ఆ నోట్లు ఉన్నవారంతా తప్పుడు మార్గాల ద్వారా ఆ సొమ్ము సంపాదించారనడం కరెక్టేనా..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ట్రాకింగ్ పెట్టాలని అడిగే ధైర్యం అన్నామలైకు ఉందా..? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.