మధ్యప్రదేశ్ లో డబుల్ ఇంజిన్.. ట్రబుల్ ఇంజిన్..

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలు పెరుగుతున్నాయి, అభివృద్ధి అడుగంటుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అందుకే రాష్ట్రాల్లోనే కాదు, కేంద్రంలో కూడా బీజేపీని తరిమేయాలనుకుంటున్నారు ప్రజలు.

Advertisement
Update:2022-09-25 09:05 IST

దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయిందనే విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ హయాంలో గత 8 ఏళ్లలో నిరుద్యోగత రేటు పెరిగింది. ఆగస్ట్ లో రికార్డ్ స్థాయిలో 8.3శాతానికి చేరుకుంది. అయితే దీనికి కూడా కారణాలు వెదికి పెట్టుకున్నారు బీజేపీ నేతలు. తప్పంతా కరోనాపై నెట్టేస్తున్నారు. అదే సమయంలో డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలే నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నాయి. మధ్యప్రదేశ్ లో దాదాపు 3 లక్షల పోస్ట్ లు భర్తీచేయాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మరోవైపు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు లేకపోయినా 2లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసి తెలంగాణ సర్కారు ఉపాధి కల్పనలో ముందు ఉంది.

మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ శాఖల్లో స్టేట్‌ కేడర్‌ లో లక్ష పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలోని 44 శాఖల్లో, ప్రతి శాఖలోనూ వెయ్యికి పైగానే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క విద్యాశాఖలోనే 45,767 ఖాళీలు ఉన్నాయి. కానీ ఉద్యోగాల భర్తీకి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేకపోవడం విశేషం. 21,096 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా దళిత, గిరిజనులను ప్రభుత్వం మోసం చేస్తోందే కానీ ఖాళీలను భర్తీ చేయడంలేదు.

డబుల్ ట్రబుల్..

డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏమవుతుంది..? కేంద్రంతో రాష్ట్రం సఖ్యతగా ఉంటుంది కాబట్టి నిధులు దండిగా వస్తాయని, అభివృద్ధి జోడుగుర్రాల పరుగులా ఉంటుందనేది బీజేపీ వాదన. మరి మధ్యప్రదేశ్ లో ఏమైంది, ఒక్క మధ్యప్రదేశ్ మాత్రమే కాదు.. మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధిలో వెనకపడుతున్నాయి. వాటికంటే స్థానిక పార్టీల అధీనంలో ఉన్న రాష్ట్రాలే ఎందుకు మెరుగైన ర్యాంకులు సాధిస్తున్నాయి. ఈ విషయాలన్నీ దాచిపెడుతూ డబుల్ ఇంజిన్ అంటూ రాష్ట్రాల్లో పాగా వేయాలని కుతంత్రాలు పన్నుతోంది బీజేపీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలు పెరుగుతున్నాయి, అభివృద్ధి అడుగంటుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అందుకే రాష్ట్రాల్లోనే కాదు, కేంద్రంలో కూడా బీజేపీని తరిమేయాలనుకుంటున్నారు ప్రజలు.

Tags:    
Advertisement

Similar News