పోలీస్ స్టేషన్‌లో శవాలైన భర్త, మైనర్ భార్య.. - పోలీసులపై గ్రామస్తుల దాడి

పోలీసులు చిత్రహింసలు పెట్టి కొట్టడం వల్లే నూతన వధూవరులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు.

Advertisement
Update:2024-05-19 09:08 IST

నూతన వధూవరులను పోలీసులు కొట్టడంతో వారు పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని.. వారి చావుకు పోలీసులే కారణమంటూ గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగడంతో ఐదుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం అరారియాలో జరిగింది. అరారియాలోని తారాబరి గ్రామానికి చెందిన ఓ యువకుడి భార్య కొన్ని నెలల కిందట చనిపోయింది. దీంతో అతడు తనకు వరుసకు కోడలు అయ్యే బాలికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల కిందటే వారిద్దరికీ వివాహం జరిగింది.

అయితే బాలిక వయసు 14 ఏళ్ళే కావడంతో బాల్యవివాహం కేసులో నూతన వధూవరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని తారాబరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో తెలియదు కానీ భర్త, మైనర్ భార్య స్టేషన్లోనే చనిపోయారనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో తారాబరి గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు.

పోలీసులు చిత్రహింసలు పెట్టి కొట్టడం వల్లే నూతన వధూవరులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ దాడి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఎస్‌డీపీవో రాంపూకర్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పారు. అయినప్పటికీ గ్రామస్తులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పోలీసులు కొట్టడం వల్లే దంపతులు ప్రాణాలు తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం అసలేం జరిగిందో చెప్పడానికి కూడా నోరు విప్పడం లేదు. దీంతో అరారియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Tags:    
Advertisement

Similar News