లేడీ డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి బెయిల్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లేడీ డాక్టర్‌ హత్యాచార కేసులో ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement
Update:2024-12-13 20:43 IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లేడీ డాక్టర్‌ హత్యాచార కేసులో కోల్‌కతాలోని ఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌, అభిజిత్ మోండల్‌లకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు సీబీఐ దర్యాప్తు పట్ల నిరాశ వ్యక్తం చేశారు. నిందితులకు బెయిల్ రావడంతో తమ గుండె పగిలిపోయిందని తెలిపారు. కోల్‌కతాలోని సీల్ధాలోని కోర్టు, నిందితులకు బెయిల్ మంజురు చేసింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్ట్‌ 9న నైట్‌ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది.

మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌తోపాటు కేసు నమోదులో ఆలస్యం వహించిన పోలీస్‌ అధికారి అభిజిత్ మోండల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది.కాగా, నాటి నుంచి రిమాండ్‌ నిమిత్తం జైలులో ఉన్న వీరిద్దరికి సీల్దా కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. 90 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా చార్జిషీట్ దాఖలు చేయనందున కోర్టు బెయిల్‌ మంజూరు చేసినట్లు వారి తరుఫు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరో కేసులో సీబీఐ విచారణను మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో బెయిల్‌ లభించినప్పటికీ ఆయన జైలులో ఉండనున్నారు.

Tags:    
Advertisement

Similar News