భక్తులకు సౌకర్యాల కల్పనపై.. అయోధ్య ట్రస్టుకు టీటీడీ పాఠాలు..
అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత నిత్యం లక్షల మంది భక్తులు రాముడి దర్శనానికి పోటెత్తుతున్నారు. వీరిని నియంత్రించి, క్యూలైన్లలో పంపడం ట్రస్టుకు తలకు మించిన పనవుతోంది.
అయోధ్య రామమందిరంలో భక్తులకు సౌకర్యాల కల్పనకు మన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సాయం అందిస్తోంది. బాలరాముడి దర్శనానికి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు క్యూలైన్ల ఏర్పాటు, మంచినీరు వంటి కనీస వసతులు కల్పించడం, రద్దీ ఎక్కువైనప్పుడు ఎలా నియంత్రించాలి వంటి వాటిపై ఓ ప్రణాళిక తయారుచేయాలని అయోధ్య ట్రస్టు కోరింది. ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో, ఎలాంటి ప్రణాళిక అనుసరించాలో టీటీడీ ఓ రిపోర్టు తయారుచేసి అందించబోతోంది. ఇందుకోసం టీటీడీ ఉన్నతాధికారులు గత మూడు రోజులుగా అయోధ్య రామాలయం పరిశీలిస్తున్నారు.
టీటీడీ సాయం కోరిన అయోధ్య రామమందిర ట్రస్టు
అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత నిత్యం లక్షల మంది భక్తులు రాముడి దర్శనానికి పోటెత్తుతున్నారు. వీరిని నియంత్రించి, క్యూలైన్లలో పంపడం ట్రస్టుకు తలకు మించిన పనవుతోంది. ఈ నేపథ్యంలో ట్రస్టు మన టీటీడీని సంప్రదించింది. క్యూలైన్ల ఏర్పాటు, భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు కొన్ని సలహాలు, సాంకేతిక సాయం అందించాలని కోరింది. దీంతో టీటీడీ రంగంలోకి దిగింది.
ఈవో నేతృత్వంలో రంగంలోకి..
టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం శుక్రవారం నుంచి అయోధ్యలోనే మకాం వేసింది. ఆలయ పరిసరాలు, ఆలయం లోపల ప్రాంతం, భక్తులు వచ్చి పోయే మార్గాలు వంటివన్నీ రెండు రోజులపాటు క్షుణ్ణంగా పరిశీలించారు. దీని ఆధారంగా ఓ రిపోర్టు తయారుచేసి ఈరోజు అయోధ్య రామమందిర ట్రస్టు అధికారులకు అందించబోతున్నారు.