ఫైనల్‌లో భారత్ గెలిస్తే.. రూ.100 కోట్లు పంచేస్తా.. - ఆస్ట్రోటాక్ సీఈవో
టీమిండియా గెలవాలని కోరుకుందాం.. ప్రార్థిద్దాం.. అని ఈ సందర్భంగా ఆయన తన కస్టమర్లకు పిలుపునిచ్చారు.
అభిమానుల్లో క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ పీక్స్‌కి చేరింది. భారత్ - ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరడంతో ఇప్పుడు అందరికీ ఆ మ్యాచ్‌పైనే ఆసక్తి నెలకొంది. రెండూ బలమైన జట్లే కావడంతో సర్వత్రా ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. ఇక భారత్ అభిమానులైతే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి మూడోసారి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం కొందరైతే యాగాలు, పూజలు కూడా జరిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా తమ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించారు. ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతానని ఆయన తెలిపారు.
ఈ ఆఫర్‌ను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు తాను కాలేజీలో చదువుకుంటున్నానని, ఆ రోజు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశానని ఆయన చెప్పారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు తమకు టెన్షనేనని ఆయన వివరించారు. ఆ టోర్నీలో టీమిండియా గెలిచాక.. తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు తాము ఎంతో ఎంజాయ్ చేశామని తెలిపారు. తన జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటని పేర్కొన్నారు. ఇప్పుడు టీమిండియా మళ్లీ ఫైనల్‌కు వచ్చిందని, ఈసారి భారత్ గెలిస్తే ఏం చేయాలా? అని తాను చాలాసేపు ఆలోచించానని తెలిపారు. 2011లో తన ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని.. కానీ, ఇప్పుడు తమ ఆస్ట్రోటాక్ యూజర్లంతా తన స్నేహితులేనని పేర్కొన్నారు. వారితో కలిసి తన ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానని తెలిపారు. భారత్ ప్రపంచ కప్‌ను ముద్దాడితే తమ సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. టీమిండియా గెలవాలని కోరుకుందాం.. ప్రార్థిద్దాం.. అని ఈ సందర్భంగా ఆయన తన కస్టమర్లకు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
♦