అసెంబ్లీలను ప్రారంభించినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు..? ప్రతిపక్షాలపై అస్సోం సీఎం ఫైర్

ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అసెంబ్లీ భవనాలు గవర్నర్లకు గానీ, రాష్ట్రపతికి గానీ ఆహ్వానం ఇవ్వకుండానే ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

Advertisement
Update:2023-05-25 08:52 IST

దేశంలో ఇటీవల కాలంలో ఎన్నో అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవాలు జరిగాయని.. ఆ ప్రారంభోత్సవాలకు గవర్నర్ల కు గానీ, రాష్ట్రపతికి గానీ ఆహ్వానం అందలేదని, అప్పుడు చెయ్యని అభ్యంతరాలు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపైనే ఎందుకు చేస్తున్నారని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఈనెల 28వ తేదీన ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ భవనాన్ని రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడంపై దేశంలోని పలు ప్రధాన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువ లేదని ఆరోపించాయి. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరుకాబోమంటూ కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాదీ, ఎన్సీపీ తదితర 19 పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి.

దీనిపై అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అసెంబ్లీ భవనాలు గవర్నర్లకు గానీ, రాష్ట్రపతికి గానీ ఆహ్వానం ఇవ్వకుండానే ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అప్పుడు ఎవరూ దీనిపై విమర్శలు చేయలేదన్నారు.

2014లో జార్ఖండ్, అస్సోం శాసనసభ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు యూపీఏ ముఖ్యమంత్రులే చేశారని.. ఈ కార్యక్రమాలకు గవర్నర్ ను కూడా ఆహ్వానించలేదని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. 2018లో ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ భవనానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, అలాగే 2020లో ఛత్తీస్‌గఢ్ శాసన భవన నిర్మాణానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆయా కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం అందలేదన్నారు.

ఇక ఇదే ఏడాది తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని, ఆ కార్యక్రమానికి కూడా గవర్నర్ కు ఆహ్వానం లేదని వివరించారు. ఇన్నిచోట్ల నూతన అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపనలు జరిగితే ఒక్కచోట కూడా గవర్నర్ కు గానీ, రాష్ట్రపతి గానీ ఆహ్వానం అందలేదన్నారు. మరి అప్పుడెవ్వరూ అభ్యంతరాలు వ్యక్తం చెయ్యకుండా ఇప్పుడు పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తుంటే చేస్తున్నారన్నారు. ఇది ప్రతిపక్ష పార్టీలకు సమంజసం కాదని హిమంత బిశ్వ శర్మ హితవు పలికారు.

పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని, అందువల్ల దాన్ని ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడం సహజమేనని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు తమ నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బహిష్కరణ నాటకం ఆడుతున్నాయని హిమంత బిశ్వ శర్మ విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News