ఏపీ నీళ్లు తరలించుకుపోతున్నా సర్కారు మౌనమెందకు?

రేవంత్‌ సర్కారును ప్రశ్నించి మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2025-02-16 16:04 IST

ఆంధ్రప్రదేశ్‌ నాగార్జున సాగర్‌ కుడి కాలువ నుంచి యథేచ్ఛగా నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ గండికొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్య చూస్తుండటం దుర్మార్గమన్నారు. తెలంగాణ సీఎం, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వాటర్‌ ఇయర్‌లోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి ఏపీ ఇప్పటి వరకు 646 టీఎంసీలు తరలించుకుపోయింది.. మూడు నెలలుగా సాగర్‌ కుడి కాలువ నుంచి రోజుకు 10 వేల క్యూసెక్కుల చొప్పున తరలించుకు పోతుందని తెలిపారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉన్న నాగార్జున సాగర్‌ నుంచి ఏపీ యథేచ్ఛగా నీటిని తరలించుకోవడం ఏమిటని నిలదీశారు. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచాల్సిన నీటిని కూడా ఏపీ తరలించుకున్నా పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. కేఆర్‌ఎంబీ త్రీ మెంబర్‌ కమిటీ సమావేశం ఇప్పటి వరకు నిర్వహించలేదని.. ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలించుకుపోతుందని.. ఇంత జరుగుతుంటే కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకపోతే సాగర్‌ ఆయకట్టు ప్రమాదంలో పడటంతో పాటు హైదరాబాద్‌ నగరానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఏపీ నీటి దోపిడీని అరికట్టేలా కృష్ణా బోర్డుపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News