తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన ఏఎన్‌ఆర్‌

మన్‌ కీ బాత్‌ కార్యక్రమం 117వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్రమోడీ

Advertisement
Update:2024-12-29 13:53 IST

ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమం 117వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్రమోడీ అనేక విషయాలు పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు చేసిన కృషిని కొనియాడారు. తెలుగు సినిమాను ఆయన మరోస్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. నాగేశ్వరరావు సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపెట్టేవారని గుర్తుచేసుకున్నారు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ తపన్‌ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్‌కపూర్‌ తన సినిమాల ద్వారా భారతదేశంలో సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. భారతీయ చలనచిత్ర రంగంపైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ప్రధాని అన్నారు. మొదటిసారి వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ వచ్చే ఏడాది మన దేశంలో నిర్వహించబోతున్నామని ప్రధాని చెప్పారు. ఈ సమ్మిట్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని తెలిపారు.

రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ.. రాజ్యాంగం భారతీయులందరికీ ఓ మార్గనిర్దేశకమని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పవిత్ర గ్రంథంపై ప్రజలు తమ అభిప్రాయాలను వీడియోలుగా రూపొందించి.. ఈ వెబ్‌సైట్‌లో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ 75 ఏళ్ల సంబరాల్లో ప్రజలను భాగం చేయాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించామన్నారు. అంతేగాకుండా ఈ వెబ్‌సైట్‌లో అనేక భారతీయ భాషల్లో రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని.. అన్ని భాషల వారు రాజ్యాంగ పీఠికను.. అనేక విషయాలను చదివి.. అర్థం కాని వాటిపై ప్రశ్నలు కూడా అడగవచ్చని ప్రధాని తెలిపారు.

జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభ మేళాను ఐక్యతా మేళాగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన టూర్‌ ప్యాకేజీలు, వసతి వంటి సమాచారం తెలుసుకోవడానికి భక్తులు ఏఐ చాట్‌బాట్‌ 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు.అందులో డిజిటల్‌ నావిగేషన్‌ సహాయంతో భక్తులు కుంభమేళాలోని వివిధ ఘాట్‌లు, దేవాలయాలు, సాధువుల శిబిరాలను చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. కుంబమేళాలో తప్పిపోయిన వారిని కనుక్కోవడానికి ఏఐ ఆధారిత కెమెరాలను, డిజిటల్‌ లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లు కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News