రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు.. సహ నిందితులుగా కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవప్రసాద్ వారిపై ఈ కేసు వేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం అవినీతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రచారం చేయడంపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
పరువు నష్టం కేసులో కోర్టు తీర్పుతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఇప్పుడు మరో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈసారి కేసు నమోదైంది కర్ణాటక రాష్ట్రంలో. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ పరువు నష్టం కేసులో నిందితులుగా ఉన్నారు. వీరందరికి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 27 న కేసు విచారణ జరగనుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవప్రసాద్ వారిపై ఈ కేసు వేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం అవినీతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రచారం చేయడంపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 40 శాతం అవినీతితో నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు దోచుకుందని మే 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ దినపత్రికల్లో అడ్వర్ టైజ్ మెంట్ ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. వాటన్నింటిని నిరాధార ఆరోపణలుగా ఆయన కొట్టి పారేశారు. తమ పరువు నష్టానికి సంబంధించిన అంశంగా కేశవప్రసాద్ పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారం కారణంగానే తాము ఓటమి పాలయ్యామన్నారు. 40 శాతం అవినీతి అనేదే ఎన్నిక ప్రచారంలో కీలకంగా మారిందన్నారు.