అమృత్ పాల్ సింగ్ కొత్త రాజకీయ పార్టీ
ఈనెల 14న ప్రకటించే అవకాశం
ఖలిస్థాని వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాడని సమాచారం. ఈనెల 14న రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముందని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడిస్తున్నాయి. వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు దీప్ సిద్ధూ హత్య తర్వాత ఆ సంస్థకు తానే నాయకుడని ప్రకటించుకున్న అమృత్ పాల్ అమృత్‌సర్ జిల్లా అజ్‌నాలాలో పోలీసులపై దాడి కేసుతో పాపులర్ అయ్యాడు. నెల రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న అమృత్ పాల్ ను ఒక గురుద్వారాలో అరెస్టు చేశారు. డిబ్రూగఢ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అమృత్ పాల్ సార్వత్రికల్లో పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం ఇండిపెండెంట్ గా పోటీ చేసి లక్షన్నరకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. పార్టీని స్థాపించి పంజాబ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడంతో పాటు సమాంతరంగా ఖలిస్థాని వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపించాలనే యోచనలో అమృత్ పాల్ సింగ్ ఉన్నట్టు తెలుస్తోంది.