అంబేద్కర్ మా దేవుడు.. అమిత్ షా క్షమాపణలు చెప్పాలే
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తమకు దేవుడని.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనోభావాలు దెబ్బతీశారన్నారు. భారత రాజ్యాంగానికే ఇది ఘోర అవమానమన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసే సంఘ్ పరివార్ కుట్రలో భాగంగానే అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. రాజ్యాంగం, జాతీయ జెండాపై బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితమైందన్నారు. వెంటనే మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.