అదానీపై లంచం ఆరోపణలు.. ఆ అధికారం యూఎస్ సెక్ లేదా?
గౌతమ్ అదానీ,సాగర్‌లకు సరైన దౌత్యమార్గాల ద్వారా సమన్లు అందజేయాల్సి ఉంటుందన్నవిశ్వసనీయ వర్గాలు
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌లకు సరైన దౌత్యమార్గాల ద్వారా సమన్లు అందజేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విదేశీ పౌరులను పిలిపించే అధికార పరిధి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంచ్ కమిషన్ (యూఎస్ సెక్) లేదని పేర్కొన్నారు. సౌర విద్యుత్ సరఫరా కాంట్రాక్టులు దక్కించుకోవడానికి 265 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,200 కోట్లు) లంచం ఇచ్చారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని యూఎస్ సెక్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, ఇదే నగంలోని సాగర్‌కు చెందిన బోదక్‌దేవ్ ఇంటికి సమన్లు పంపారని, వీటిని అందుకున్న తదుపరి రోజు నుంచి 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వీటికి స్పందించకపోతే వారి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందని అందులో తెలిపింది. అయితే ఇప్పటివరకు అదానీలకు ఎలాంటి సమన్లు అందలేదని సమాచారం. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా దౌత్యమార్గాలను అనుసరించి అదానీలకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని ఈ వ్యవహారంతో దగ్గరి సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.