సుప్రీంకోర్టులో ఇక అన్నికేసుల విచారణ లైవ్ స్ట్రీమింగ్‌లో
దీనికోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. లోటుపాట్లను త్వరలో అమల్లోకి
సుప్రీంకోర్టు చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. సుప్రీంలో ఇకపై జరిగే అన్ని కేసుల విచారణకు లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. దీనికోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో లోటుపాట్లను త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. రెండేళ్ల కిందట రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో మొదటి విచారణ 'సేన vs సేన' కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో శిండే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం లాంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, శిండే వర్గాల మధ్య పోరు నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసింది.
కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నది. అయినా ఆచరణలోకి రాలేదు. అయితే మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ పదవీ విరమణ రోజు.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా చూసేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను లైవ్ ద్వారా ప్రసారం చేయడం అదే మొదటిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని రెండేళ్ల కిందట నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారు.