టేకాఫ్ టైమ్‌లో విమానంలో మంటలు - పైలట్ అప్రమత్తతతో త్రుటిలో తప్పిన ముప్పు
విమానంలో పొగలు.. ఆ వెనుకే మంటలు.. అంతే ఒక్కసారిగా ప్రయాణికులంతా బిక్కచచ్చిపోయారు. భయంతో వణికి పోయారు.
అది మస్కట్ నుంచి కొచ్చికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం.. ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చున్నారు. ఇక కొద్ది సేపట్లో విమానం టేకాఫ్ తీసుకుంటుంది.. రన్‌వేపై విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఒక్కసారిగా అలజడి.. విమానంలో పొగలు.. ఆ వెనుకే మంటలు.. అంతే ఒక్కసారిగా ప్రయాణికులంతా బిక్కచచ్చిపోయారు. భయంతో వణికి పోయారు. అప్పటికే పైలట్ అప్రమత్తమై విమానాన్ని టేకాఫ్ చేయకుండా రన్‌వే పైనే నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది.
రన్‌వేపై విమానం బయలుదేరిన కొద్దిసేపటికే పొగ, మంటలను గమనించిన పైలట్ ఆ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని టేకాఫ్ చేయకుండా రన్‌వేపైనే నిలిపివేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానంలోని రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను తెరిచారు. వెంటనే ప్రయాణికులు వాటినుంచి బయటపడ్డారు. కొంతమంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి దూకేశారు. బతుకుజీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు.
గురువారం జరిగిన ఈ ఘటన మస్కట్‌లో చోటుచేసుకోగా, ఆ సమయానికి విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు రెండేళ్లలోపు వారే కావడం గమనార్హం. వీరితో పాటు మరో ఆరుగురు సిబ్బంది కూడా విమానంలో ఉన్నారు.
విమానంలోని ఇంజన్ నంబర్-2లో మంటలు వచ్చినట్టు పైలట్, సిబ్బంది గుర్తించారు. టేకాఫ్ కి కొద్ది క్షణాల ముందు పైలట్ పొగ రావడాన్ని గుర్తించి అప్రమత్తమవడంతో ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పంపించేందుకు విమానాశ్రయం సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దీనిపై వెంటనే హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు.