ముంబై ఎయిర్ హోస్టెస్‌ను చంపిన వ్య‌క్తి.. లాకప్‌లోనే ఆత్మ‌హ‌త్య

కేసు విచారణలో భాగంగా సీసీటీవీ కెమెరాల‌ను పరిశీలించిన పోలీసులు ఉద‌యం 11.30 నిమిషాల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 నిమిషాల వ‌ర‌కు రూపాల్ ఫ్లాట్‌లోనే అత్వాల్ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement
Update:2023-09-08 16:10 IST

ముంబైలో ఎయిర్ హోస్ట్‌గా శిక్ష‌ణ పొందుతున్న రూపాల్ ఓగ్రే అనే యువతిని హత్య కేసులో అరెస్ట్ అయిన విక్ర‌మ్ అత్వాల్ అనే వ్య‌క్తి లాకప్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం అంధేరి పోలీసు స్టేషన్ లాకప్‌ టాయిలెట్‌లోకి ప్రవేశించిన నిందితుడు చాలాసేపటి వరకు బయటకు రాకపోవటంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ క్రమమంలోనే తలుపులు పగులగొట్టి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు.



ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిర్ ఇండియాకు ఎంపికైంది. శిక్షణ కోసం ముంబై అంధేరిలోని ఒక హౌసింగ్ సొసైటీలో తన సోదరి, మరో ఫ్రెండ్‌తో కలిసి నివాసం ఉంటోంది. అయితే వారం రోజుల క్రితం వారిద్దరు వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు. దీంతో ఫ్లాట్‌లో రూపాల్ ఒంటరిగా ఉంటుంది. బాధితురాలు చివరిసారిగా ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడింది. అయితే ఆ తర్వాత రూపాల్ కుటుంబ సభ్యుల ఫోన్‌లు ఎత్తకపోవడంతో.. వారు ముంబైలోని ఆమె స్నేహితులను సంప్రదించారు. వారు రూపాల్ నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడగా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న రూపాల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రూపాల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.



కేసు విచారణలో భాగంగా సీసీటీవీ కెమెరాల‌ను పరిశీలించిన పోలీసులు ఉద‌యం 11.30 నిమిషాల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 నిమిషాల వ‌ర‌కు రూపాల్ ఫ్లాట్‌లోనే అత్వాల్ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో రూపాల్ ను భయపెట్టి, దాడి చేయడమే తన ఉద్దేశ్యమని అత్వాల్ ఒప్పుకున్నాడు. అయితే.. ఆమె పోరాడటంతోనే మెడపై రెండుసార్లు కత్తితో పొడిచానని చెప్పినట్టు సమాచారం. అతడికి విధించిన మూడు రోజుల పోలీసు కస్టడీ పూర్తయిన తర్వాత ఈ శుక్రవారం అంధేరీ కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా విక్రమ్ త‌న ప్యాంట్‌తోనే జైలు గ‌దిలో ఉరివేసుకున్న‌ట్లు పోలీసులు ధ్రువీకరించారు.

*

Tags:    
Advertisement

Similar News