నాసిక్ నుండి 10,000 మంది రైతుల లాంగ్ మార్చ్ ప్రారంభం

మహారాష్ట్రతో సహా దేశ‌మంతా ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత మూడు వారాలుగా ఉల్లి ధర పతనమవడం వేలాది మంది రైతులను కుదేలు చేసింది.

Advertisement
Update:2023-03-13 21:28 IST

తమ డిమాండ్ల సాధన కోసం 10,000 మంది రైతులు మహారాష్ట్ర నాసిక్ నుంచి ఈ రోజు లాంగ్ మార్చ్ ప్రారంభించారు. అఖిల భారత కిసాన్ సభ (AIKS) నాయకత్వంలో సాగుతున్న ఈ మార్చ్ ముంబై వరకు సాగుతుంది. పంటలకు , ముఖ్యంగా ఉల్లి, పత్తి, సోయాబీన్, పచ్చిమిర్చి మొదలైన పంటలకు తక్షణం మద్దతు ధర, తదితర 17 డిమాండ్లతో ఈ మార్చ్ సాగుతోంది.

మహారాష్ట్రతో సహా దేశ‌మంతా ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత మూడు వారాలుగా ఉల్లి ధర పతనమవడం వేలాది మంది రైతులను కుదేలు చేసింది.

ది ప్రింట్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 4న లాసల్‌గావ్ (మహారాష్ట్ర)లో ఉల్లి ధరలు క్వింటాల్‌కు రూ. 1,151గా ఉండగా, ఫిబ్రవరి 26 నాటికి మూడు వారాల్లో ధరలు క్వింటాల్‌కు రూ.550కి పడిపోయాయి.

సాధారణంగా, ఉల్లిని ఖరీఫ్, చివరి ఖరీఫ్, రబీ...ఈ మూడు సీజన్లలో సాగు చేస్తారు. రబీ సీజన్ ఉల్లిపాయలు మాత్రమే ఒక నెల కంటే ఎక్కువ కాలం నిల్వ చేయగల్గుతారు. అయితే, ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతో రైతులు ఖరీఫ్ చివరి పంటలను ముందుగానే సాగు చేశారు; దాంతో ఉల్లిపాయల ఉత్పత్తి అమాంతంగా పెరిగిపోయింది. మరో వైపు సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు దిగుమతి సుంకాలను పెంచడం కూడా రైతులను తీవ్రంగా నష్టపరిచింది.

AIKS తన డిమాండ్ చార్టర్‌లో ఉల్లిపాయలకు క్వింటాల్‌కు రూ. 2,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. తక్షణమే క్వింటాల్‌కు రూ.600 సబ్సిడీ ఇవ్వాలని, ఎగుమతి విధానాలను మార్చాలని AIKS కోరింది.

ఇతర ముఖ్యమైన డిమాండ్లలో.. రైతాంగానికి పూర్తి రుణమాఫీ, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులను మాఫీ చేయడం, రోజువారీ 12 గంటల విద్యుత్ సరఫరా, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయినప్పుడు ప్రభుత్వం, బీమా సంస్థల ద్వారా పరిహారం. పీఎం హౌసింగ్ స్కీమ్ సబ్సిడీని రూ. 1.40 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు ఉన్నాయి.

ఈ మార్చ్ లో పాల్గొంటున్న రైతులు నిన్ననే నాసిక్ నగరం వెలుపల గుమిగూడారు. వారు ఈ రోజు పట్టణంలోకి ప్రవేశించారు. నాసిక్ లో ఉల్లిపాయలు, టమోటాలు, బెండకాయలు మొదలైన వాటిని నేల మీద పడేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కొన్ని రోజుల క్రితం, మహారాష్ట్ర‌ సీనియర్ మంత్రి దాదా భూసే, AIKS ప్రతినిధి బృందం మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. కాని ఒక నిర్ణయానికి రాలేక పోయారు. నివేదికల ప్రకారం, AIKS ప్రతినిధి బృందం మార్చి 14న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలవనుంది. అయితే, సంతృప్తికరమైన ఒప్పందం కుదిరే వరకు కిసాన్ లాంగ్ మార్చ్ కొనసాగుతుందని AIKS స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News