అప్పులు చెల్లిస్తే పాప పరిహారం జరుగుతుందా..?

ప్రభుత్వానికి ఈ మరక అంటుకుంది కానీ దాన్ని కడిగేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో కూడా అదానీ గ్రూప్ రుణాలు చెల్లిస్తూ మరో కనికట్టుకి తయారైంది.

Advertisement
Update:2023-03-07 16:21 IST

హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్ తో అదానీ గ్రూపు డొల్లతనం బయటపడింది. ఇంటా బయటా అదానీకి మోతమోగిపోయింది. అంతర్జాతీయంగా పరువు బజారున పడింది, కుబేరుల జాబితాలో ర్యాంకు దిగజారి పోయింది. వ్యాపారస్తులకు ఇలాంటివన్నీ మామూలే అయినా.. ఇక్కడ నష్టపోయింది అదానీ కాదు. ఆయన షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు. వీరిలో ఎల్ఐసీ వంటి కంపెనీల నుంచి సామాన్య షేర్ హోల్డర్ లు కూడా ఉన్నారు. అదానీ గాలిబుడగ పేలిపోయే సరికి వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రభుత్వానికి ఈ మరక అంటుకుంది కానీ దాన్ని కడిగేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో కూడా అదానీ గ్రూప్ రుణాలు చెల్లిస్తూ మరో కనికట్టుకి తయారైంది.

ఫలానా వ్యాపారి దివాళాతీశాడనే వార్త బయటకు రాగానే అప్పులోళ్లంతా చుట్టుముట్టడం కామన్. కానీ అదానీ తెలివిగా అప్పులోళ్లనే ఇంటికి పిలిచాడు. మా కంపెనీకి వచ్చిన ఢోకా ఏమీ లేదు, అయినా మీ బాకీ ముందుగానే కట్టేస్తామన్నాడు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కు 1500 కోట్ల రూపాయల రుణాన్ని వడ్డీతో సహా తిరిగిచ్చేశాడు. క్రెడిట్ సూయిజే, జేపీ మోర్గాన్, జేఎం ఫైనాన్స్ వంటి ఇతర కంపెనీలకు సుమారు రూ. 8,000 కోట్ల ప్రీపెయిడ్ రుణాలను కూడా చెల్లించాడు. తాజాగా షేర్లు తనఖా పెట్టి తెచ్చిన మరో రూ.7,374 కోట్ల రుణాలను ముందుగానే చెల్లించినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది.

2025 వరకు గడువు ఉన్నా కూడా రుణాల భారాన్ని తగ్గించుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రమోటర్లు చెల్లింపులు చేసినట్లు పేర్కొంది అదానీ గ్రూప్. పలు అంతర్జాతీయ బ్యాంకులు, దేశీయ ఆర్థిక సంస్థలకూ చెల్లింపులు జరిగినట్టు తెలిపింది. ఈ చెల్లింపుల ద్వారా అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కు చెందిన 155 మిలియన్ల షేర్లు, అదానీ ఎంటర్‌ ప్రైజెస్ కి చెందిన 31 మిలియన్ల షేర్లు, అదానీ ట్రాన్స్ మిషన్ కి చెందిన 36 మిలియన్ల షేర్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీకి చెందిన 11 మిలియన్ల షేర్లు బ్యాంకుల నుంచి బయటకు వస్తాయి.

అదానీ అప్పులు చెల్లించారు సరే, ఈ చెల్లింపుల ద్వారా అప్పులి ఇచ్చిన సంస్థలు, అదానీ గ్రూపు రెండూ బాగానే ఉన్నాయి. పైగా అదానీపై ఎనలేని సింపతీ క్రియేట్ అయింది. మరి మధ్యలో మోసపోయిన మధ్యతరగతి మదుపరి సంగతేంటి. షేర్ మార్కెట్ నియమనిబంధనల ప్రకారం వారికి నష్టపరిహారం జరగదు. ఎల్ఐసీ లాంటి సంస్థలు కూడా అదానీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టి నష్టపోవడానికి పరోక్షంగా కారణమైన కేంద్రం దీన్ని పట్టించుకోదు. ఇదీ ఇక్కడ జరిగేది.

Tags:    
Advertisement

Similar News