సెట్ ఎందుకు దండగ..? ఒరిజినల్ పార్లమెంట్ ఉందిగా..? - కంగనా దరఖాస్తు
తాను బీజేపీకి చాలా విషయాల్లో వంతపాడుతుంటాను కాబట్టి.. కాసేపు పార్లమెంట్‌ను షూటింగ్‌కు ఇవ్వలేరా అన్న ధీమాతో ఆమె ఈ దరఖాస్తు చేసుకున్నారా అన్న చర్చ నడుస్తోంది
బీజేపీ వీరాభిమానిగా పేరుగాంచిన నటి కంగనా రనౌత్ తన షూటింగ్‌కు పార్లమెంట్‌ను అప్పగించాలని అడుగుతున్నారు. ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని ఘట్టాలను ఆమె సినిమాగా తీస్తున్నారు. ఎమర్జెన్సీ పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. ఇందిరాగాంధీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఘట్టం అది. ఆ ఘట్టం మీదే కంగనా సినిమా తీస్తుండటంతో ఇందిరా గాంధీని ఈ సినిమా ద్వారా ప్రజల్లో చులకన చేసే ప్రయత్నం జరుగుతోందా..? అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కంగనా కాషాయ పార్టీ అభిమాని కాబట్టి. ఇందిరా జీవితంలో ఎమర్జెన్సీ లాంటి ప్రతికూల నిర్ణయాలు ఉన్నా ఆమె ఆఖరికి దేశ ప్రజల దృష్టిలో విజయవంతమైన నాయకురాలిగా నిలిచిపోయారు.
''ఎమర్జెన్సీ'' సినిమాలో కంగనా రనౌతే ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తున్నారు. ఆమే నిర్మాత, దర్శకురాలు. ఈనేపథ్యంలో ఆమె ఈ సినిమా షూటింగ్ కోసం పార్లమెంట్‌ను ఇవ్వాల్సిందిగా కోరడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు అధికారులకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ మీద సినిమా కాబట్టి పార్లమెంట్‌లో కొన్ని సన్నివేశాలు ఉంటాయని, కాబట్టి ప్రస్తుత పార్లమెంట్‌లో షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని లోక్‌సభ కార్యాలయాన్ని కోరారు.
కంగనా విజ్ఞప్తిని లోక్‌సభ సచివాలయం అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సినిమా షూటింగ్‌లకు ఇక్కడ అనుమతి ఇవ్వలేదు. పార్లమెంట్ ప్రసారాలు కూడా డీడీ, సంసద్ ఛానళ్ల ద్వారానే సాగుతూ వచ్చాయి. ఈ విషయాలు తెలియకుండానే కంగనా దరఖాస్తు చేసుకుని ఉంటారా అన్న ప్రశ్న వస్తోంది. తాను బీజేపీకి చాలా విషయాల్లో వంతపాడుతుంటాను కాబట్టి.. కాసేపు పార్లమెంట్‌ను షూటింగ్‌కు ఇవ్వలేరా అన్న ధీమాతో ఆమె ఈ దరఖాస్తు చేసుకున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఏమో ఈ దేశంలో మోడీ తలుచుకుంటే కానిది ఏముంది..?. షూటింగ్‌కు పార్లమెంట్‌ను ఇచ్చే ఛాన్సే లేదని అధికారులు చెబుతున్నా.. అసలైన వారు ఏ నిర్ణయం తీసుకుంటారో!.