హుగ్లీ తీరాన సినీ రాజకీయం.. ఎన్నికల బరిలో చిరంజీవి హీరోయిన్
1993లో బెంగాలీ సినిమాల్లోకి అడుగుపెట్టిన రచన పాతికేళ్లపాటు బెంగాల్ సినిమాను ఏలేశారు. అంతేకాదు ఒడియా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించారు.
పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నియోజకవర్గం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించబోతోంది. ఇద్దరు సినీతారల మధ్య పోటీకి ఇక్కడ వేదిక రెడీ అయిపోయింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీని ఓడించి హుగ్లీని తిరిగి కైవసం చేసుకోవాలని ఆలోచించిన తృణమూల్ అధినేత మమతా బెనర్జీ.. ప్రముఖ సినీ నటి, టెలివిజన్ సూపర్ స్టార్ రచనా బెనర్జీని బరిలోకి దింపారు.
100 సినిమాల్లో హీరోయిన్
1993లో బెంగాలీ సినిమాల్లోకి అడుగుపెట్టిన రచన పాతికేళ్లపాటు బెంగాల్ సినిమాను ఏలేశారు. అంతేకాదు ఒడియా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించారు. జేడీ చక్రవర్తి హీరోగా ఈవీవీ తీసిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. చిరంజీవితో బావగారూ బాగున్నారా, శ్రీకాంత్‌తో కన్యాదానం, మావిడాకులు, పిల్లనచ్చింది సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు. బెంగాల్‌లో నంబర్ వన్ టీవీ షో దీదీ నంబర్ వన్‌తో ఈ తరం ప్రేక్షకులనూ మెప్పించారు.
దీదీతో దీదీ నంబర్ 1
కొంతకాలం కిందట ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దీదీ నంబర్ 1 స్పెషల్ షో చేశారు రచన. అప్పుడే ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయమైపోయింది. ఈరోజు ఎంపీ అభ్యర్థుల జాబితాలో రచన పేరుండటంతో లాంఛనం పూర్తయ్యిందంతే.
మరో నటి లాకెట్ ఛటర్జీపై పోటీ
బెంగాల్లో అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఒకటి హుగ్లీ నియోజకవర్గం. టాటాలు ప్లాంట్ పెట్టాలనుకున్న సింగూర్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. పారిశ్రామిక వాడ కావడంతో దశాబ్దాలుగా సీపీఎం చేతిలో ఉన్న హుగ్లీని ఎంతో పోరాడి తృణమూల్ దక్కించుకుంది. 2014, 2019ల్లో రెండుసార్లు అక్కడ టీఎంసీనే గెలిచింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ గెలిచారు. ఆమె కూడా సినీతారే. 30కి పైగా సినిమాలతోపాటు పలు టీవీ షోల్లోనూ నటించారు. ఎలాగైనా దాన్ని తిరిగి దక్కించుకోవాలని తృణమూల్ కూడా సినీగ్లామర్ ఉన్న రచనను రంగంలోకి దించింది.