మెగా సినిమాల్లో విలన్.. నిజజీవితంలోనూ విలనయ్యాడు
పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ తమ్ముడు సినిమాలో మోడల్ కాలేజ్ స్టూడెంట్‌గా విలన్ పాత్ర పోషించిన భూపిందర్‌సింగ్ తెలుగు ప్రేక్షకులకు బాగాపరిచితమయ్యాడు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో విలన్‌గా అలరించిన ప్రముఖ నటుడు భూపిందర్ సింగ్ నిజ జీవితంలోనూ విలన్‌గా మారాడు. పొలం సరిహద్దు వివాదంలో తుపాకీతో కాల్చి ఓ వ్యక్తి ప్రాణాలు తీసినందుకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు భూపిందర్‌ను అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. అతని అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తమ్ముడు, అన్నమయ్య సినిమాల్లో విలన్‌గా
పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ తమ్ముడు సినిమాలో మోడల్ కాలేజ్ స్టూడెంట్‌గా విలన్ పాత్ర పోషించిన భూపిందర్‌సింగ్ తెలుగు ప్రేక్షకులకు బాగాపరిచితమయ్యాడు. అయితే తర్వాత చిరంజీవి సినిమాల్లో ఎక్కువ పాపులరయ్యాడు. అన్నయ్య, అంజి, శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాల్లోనూ విలన్ పాత్రలు పోషించాడు. వెంకటేష్ దేవీపుత్రుడు, బాలకృష్ణ భలేవాడివి బాసూ సినిమాల్లోనూ నటించాడు. దాదాపు 10, 12 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
ఇంతకీ గొడవేంటి?
యూపీలోని కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్ సింగ్ ఫామ్ హౌస్ ఉంది. దీని పక్కనే ఉండే గుర్దీప్‌సింగ్ అనే వ్యక్తితో సరిహద్దు తగాదాలున్నాయి. ఇక్కడ ఉన్న చెట్లు కొట్టేసే క్రమంలో వారిద్దరికీ గొడవ జరిగింది. భూపిందర్ తన లైసెన్సు పిస్టల్‌తో కాల్చడంతో గుర్దీప్‌సింగ్ కుటుంబంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్దీప్ కుమారుడు గోబింద్‌సింగ్ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి భూపిందర్‌ను అరెస్టు చేశారు.