ఆదిత్య ఎల్-1 ప్రయాణంలో కీలక మైలురాయి
ఇప్పటికే 9.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1 మరో ఆరు లక్షల కిలోమీటర్ల కంటే తక్కువ దూరమే ప్రయాణిస్తే నిర్దేశిత ప్రదేశానికి చేరుకుంటుంది.
సూర్యుడికి సంబంధించిన పరిశోధల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 'ఆదిత్య ఎల్-1' ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ ప్రయాణంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఎల్-1 పాయింట్ దిశగా ప్రయాణం సాగిస్తున్న ఈ ఉపగ్రహ వ్యోమనౌక భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ క్రమంలో భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటేసినట్లు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 నిర్దేశించిన లెగ్రాంజ్ పాయింట్ 1 దిశగా దూసుకెళ్తున్నట్లు తెలిపింది.
ఎల్ 1 పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే 9.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1 మరో ఆరు లక్షల కిలోమీటర్ల కంటే తక్కువ దూరమే ప్రయాణిస్తే నిర్దేశిత ప్రదేశానికి చేరుకుంటుంది. భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి ఇస్రో ప్రయోగించిన ఒక వ్యోమనౌక ప్రయాణించడం ఇది రెండో సారి మాత్రమే. అంతకు ముందు అంగారకుడిపై ప్రయోగాల కోసం పంపిన 'మార్స్ ఆర్బిటర్ మిషన్' ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం రెండోదిగా ఇస్రో చెప్పింది.
చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఇస్రో కీలకమైన ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్ఎల్‌వీ-సీ57 అంతరిక్షంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా భూ కక్ష్య నుంచి ఆదిత్య ఎల్-1ను లెగ్రాంజ్ పాయింట్-1 వైపు మళ్లించారు. ప్రస్తుతం భూ గురుత్వాకర్షణ పరిధి నుంచి దాటేసి వెళ్లిపోయింది. ఎల్-1 పాయింట్ దగ్గర భూమి, సూర్యుడి గరుత్వాకర్షణ బలాలు అత్యంత స్వల్పంగా, సమానంగా ఉంటాయి. ఇక్కడి నుంచి సూర్యుడి ప్రయోగాలకు ఎలాంటి ఆటంకాలు కూడా ఉండని ఇస్రో వెల్లడించింది.