కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు
పార్లమెంట్ తోపులాట ఘటనలో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది
పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి మాట్లాడుతూ.. ఎంపీని తనపైకి రాహుల్ గాంధీ నెట్టారని తెలిపారు. దీంతో సదరు ఎంపీ తనపై పడడంతో తాను మెట్లపై పడిపోయానని ప్రతాప్ చెప్పారు. గాయపడిన సారంగిని పార్లమెంట్ భద్రతా సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు.
పార్లమెంట్ ఆవరణలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పార్లమెంట్ లోకి వెళ్లేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. అయితే తనను బీజేపీ ఎంపీలు లోపలకి వెళ్లకుండా ఆపారన్నారు. ఆ క్రమంలో తనను నెట్టివేశారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ-కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం అయింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తోయడంతోనే తన తలకు గాయం అయిందని ప్రతాప్ చంద్ర ఆరోపిస్తున్నారు.