గోడ కూలి 9 మంది చిన్నారుల మృతి

పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందజేస్తుందని వివరించారు.

Advertisement
Update:2024-08-04 16:38 IST

ఓ దేవాలయం గోడ కూలి 9 మంది చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన ఆదివారం ఉదయం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మరికొంతమంది చిన్నారులు గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. షాపూర్‌లోని హర్దౌల్‌ బాబా ఆలయం వద్ద నిర్వహించిన మతపరమైన వేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనతో పోలీసులు వెంటనే స్పందించి స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులందరూ 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు వారేనని జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ స్పందిస్తూ ఇది తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందజేస్తుందని వివరించారు.

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోడ కూలిన సంఘటనలు ఇటీవల తరచూ నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని రేవా జిల్లాలో గోడ కూలిన ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాల కారణంగా 200 మంది చనిపోయారు. 206 ఇళ్లు పూర్తిగా, 2,403 పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Tags:    
Advertisement

Similar News