గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్‌లో 57 శాతం ఉపాధి హామీకే
ఏటా కొత్తగా 60 లక్షల జాబ్ కార్డులిస్తున్నాం.. : లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం
గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్‌లో యేటా 57 శాతం నిధులు ఉపాధి హామీ పథకానికే కేటాయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో ఉపాధి హామీ పథకంపై మంగళవారం హాట్ హాట్‌గా డిస్కషన్ జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గడిచిన నాలుగేళ్లలో 10.43 కోట్ల మంది కార్మికుల పేర్లు తొలగించి, వారికి ఉపాధిని దూరం చేశారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ.. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ప్రతి యేటా కొత్తగా 60 లక్షల మందికి జాబ్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. జాబ్ కార్డుల్లో పారదర్శకత పెంచేందుకే ఆధార్ సీడింగ్ చేశామని, ఈక్రమంలోనే వివిధ కారణాలతో 30 లక్షల జాబ్ కార్డులను తొలగించామని తెలిపారు. అయితే ఆధార్ సీడింగ్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయమే లేదన్నారు. దేశంలో సుమారు 14 కోట్ల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా, అందులో 9.2 కోట్ల కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు.