తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. పాఠశాలకు నిప్పుపెట్టిన ప్రజలు

పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని విచారణ జరిపారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో చిన్నారి స్కూల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి కానీ, బయటికి వచ్చే దృశ్యాలు మాత్రం కనిపించలేదు.

Advertisement
Update:2024-05-17 20:08 IST

తప్పిపోయాడని భావిస్తున్న మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల ఆవరణలో కనిపించడంతో ఆగ్రహించిన ప్రజలు స్కూల్ కు నిప్పుపెట్టిన సంఘటన బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగింది. పాట్నాకు చెందిన శైలేంద్ర కుమార్ కుమారుడు ఆయుష్ కుమార్ (3) స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన ఆయుష్ కుమార్ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పాఠశాలకు వద్దకు వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ నిర్వాహకుల వద్ద వాకబు చేయగా తమకేమీ తెలియదని వారు సమాధానం చెప్పారు.

దీంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. నిర్వాహకుల తీరుపై అనుమానం రావడంతో తల్లిదండ్రులు పాఠశాల ఆవరణ అంతా వెతికారు. శుక్రవారం తెల్లవారుజామున వారికి తరగతి గది ముందున్న ఆవరణలోని మురుగు కాలువలో దాచి ఉంచిన చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. చిన్నారి మృతికి మీరే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం బయటికి రావడంతో కోపోద్రిక్తులైన స్థానికులు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకొని చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పాఠశాలకు నిప్పు పెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని విచారణ జరిపారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో చిన్నారి స్కూల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి కానీ, బయటికి వచ్చే దృశ్యాలు మాత్రం కనిపించలేదు. దీంతో పాఠశాలలోనే ఏదో జరిగిందని, పాఠశాల సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే చిన్నారి మృతదేహాన్ని దాచి పెట్టిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

స్కూల్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేసినట్లు పాట్నా పోలీస్ సూపరింటెండెంట్ చంద్ర ప్రకాష్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి శవమై కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాఠశాలకు వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Tags:    
Advertisement

Similar News