ఫారం నింపొద్దు, ఐడీ ప్రూఫ్ వద్దు.. 2వేల మార్పిడిపై మరో కన్ఫ్యూజన్

2వేల నోట్ల మార్పిడికి ఎలాంటి ఫారంలు నింపొద్దని, ఐడీలు చూపించొద్దని ప్రకటించింది ఎస్బీఐ. వాస్తవానికి ఆర్బీఐ నిబంధనల్లో ఒకరోజు ఒక వ్యక్తి 20వేల రూపాయల వరకు మాత్రమే నోట్లు మార్చుకోవచ్చు.

Advertisement
Update:2023-05-22 08:53 IST

2వేల రూపాయల నోట్లు వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. ప్రజల వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. బ్యాంకుల్లో తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా 2వేల నోట్లకు బదులుగా వేరే నోట్లను కూడా కౌంటర్లో తీసుకోవచ్చు. ఈ రెండిటిలో ఏది సౌకర్యవంతమో డిపాజిటర్లే నిర్ణయించుకోవాలి. బ్యాంకులో డిపాజిట్ చేస్తే కచ్చితంగా డినామినేషన్ రాయాలి కాబట్టి.. మన వివరాలన్నీ నమోదవుతాయి. నోట్లు మార్చుకున్నా కూడా వివరాలు సేకరిస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి భయాలు పెట్టుకోవద్దని తమ బ్యాంక్ లో ఫారంలు నింపకుండానే, ఐడీ ప్రూఫ్ చూపించకుండానే 2వేల నోట్లు మార్చుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

2వేల నోట్ల మార్పిడికి ఎలాంటి ఫారంలు నింపొద్దని, ఐడీలు చూపించొద్దని ప్రకటించింది ఎస్బీఐ. వాస్తవానికి ఆర్బీఐ నిబంధనల్లో ఒకరోజు ఒక వ్యక్తి 20వేల రూపాయల వరకు మాత్రమే నోట్లు మార్చుకోవచ్చు. అంటే కేవలం 10నోట్లు మాత్రమే అతను బ్యాంక్ కి తీసుకు రావాలి. అదే వ్యక్తి అదేరోజు మరోసారి వస్తే గుర్తించడం ఎలా..? ఫారంలు నింపొద్దు, ఐడీప్రూఫ్ చూపించొద్దు అని ఎస్బీఐ ప్రకటించడం దీనికి పూర్తి విరుద్ధం. ఐడీ ప్రూఫ్ అవసరం లేదు, ఫారంలు నింపక్కర్లేదు కాబట్టి.. ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా బ్యాంక్ కి వచ్చి విడతల వారీగా పెద్ద మొత్తంలో నోట్లు మార్చుకోవచ్చు. అంటే ఆర్బీఐ లెక్క తప్పినట్టే.

ఈనెల 23నుంచి సెప్టెంబర్ 30వరకు బ్యాంకుల్లో 2వేల నోట్ల మార్పిడికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే బ్యాంకులకు వెళ్లాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. పెద్ద మొత్తంలో నోట్లు ఉన్నవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. బంగారం కొంటున్నారు, వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. సామాన్యులపై మాత్రం ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించ లేదనే చెప్పాలి. 

Tags:    
Advertisement

Similar News