జేమ్స్‌బాండ్‌గా హాలీవుడ్‌కి రామ్‌చరణ్
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ నటన చూసి ఫిదా అయిన మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ ఏకంగా రాబోయే జేమ్స్ బాండ్ సినిమా కోసం అతని పేరును ప్రతిపాదిస్తూ ట్వీట్ చేశాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. ప్యాన్ ఇండియా మూవీగా గ్రాండ్ సక్సెస్ సాధించడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు విపరీతంగా పెరిగారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ నటన చూసి ఫిదా అయిన మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ ఏకంగా రాబోయే జేమ్స్ బాండ్ సినిమా కోసం అతని పేరును ప్రతిపాదిస్తూ ట్వీట్ చేశాడు. గత ఐదు జేమ్స్ బాండ్ చిత్రాల్లో హీరోగా నటించిన డానియల్ క్రేగ్ 'నో టైమ్ టు డై' చిత్రం తో ఈ సిరీస్‌లో తన పాత్రకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా జేమ్స్ బాండ్ పాత్రకు సూటయ్యే నటుడి కోసం ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. దానిని దృష్టిలో పెట్టుకునే చియో హోదారి కోకర్ జేమ్స్ బాండ్ నిర్మాతలనుద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశాడు. జేమ్స్ బాండ్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ రామ్‌చరణ్ లో ఉన్నాయని, ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న ఇడ్రుస్ ఎల్బ, సోపీ దిరిసు, మ్యాథ్యూ గూడ్, డ్యామ్సన్ ఇడ్రిస్తో పాటు రామ్‌చరణ్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిదని సూచించడం విశేషం. పలువురు హాలీవుడ్ విమర్శకులు కూడా చియో హోదారి కోకర్ ట్వీట్‌ని సమర్థిస్తూ.. తాము కూడా ఆర్ఆర్ఆర్ చూశామని, ఆ సామర్థ్యం రామచరణ్‌లో ఉందని పేర్కొన్నారు. 007కి రామ్‌చరణ్ సరిపోతాడని వ్యాఖ్యానించారు.
ఇది కార్యరూపం దాల్చుతుందా లేదా అన్నది పక్కన పెడితే.. భారతీయ మార్కెట్ అతి పెద్దది కావడం, ఆర్ఆర్ఆర్ ద్వారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం కూడా రామ్ చరణ్ కు అనుకూలించే అంశాలు. ఏదేమైనా భారతీయ నటుడిని 007 పాత్రకు ప్రతిపాదించడం మనం గర్వించే విషయమే. ఇక మెగా అభిమానులకైతే ఈ వార్త పండగలాంటిదే..