జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. - తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక
జపాన్ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది.
కొత్త సంవత్సరంలో తొలిరోజే జపాన్ భారీ భూకంపంతో వణికిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైనట్టు జపాన్ వాతావరణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో తీరప్రాంతాలకు సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలవగా, ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
అంతేకాదు.. దాదాపు 21 సార్లు 4.0 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. తీవ్ర భూకంపం నమోదైన నేపథ్యంలో తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామాలోని ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సునామీ ముప్పు పొంచివుందని హెచ్చరికలు చేసింది. ఇప్పటికే ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు అక్కడి వార్తా కథనాలు వెల్లడించాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఎత్తయిన సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపింది.
జపాన్ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. అవి ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. భారీ భూ ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో అణు కేంద్రాలపై వాటి ప్రభావం ఉందా అనే అంశంపై పరిశీలన చేస్తున్నట్టు హొకురీకు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. భూకంప ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.