ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కాలేకపోతున్నా.. జూనియర్ ఎన్టీఆర్ వెల్లడి
ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రాలేకపోతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినప్పటికీ.. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న వేదికపైకి వచ్చేందుకు ఇష్టం లేకే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన మనవడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ముందస్తు కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నానని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తనకు ఆహ్వానం ఇచ్చే సమయంలోనే సావనీర్ కమిటీకి చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి కమిటీ ఆధ్వర్యంలో తొలి సభను శతజయంతి కమిటీ విజయవాడలో నిర్వహించింది.
రెండో సభను హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ - మూసాపేట ప్రాంతాల మధ్య ఉన్న కైత్లాపూర్ మైదానంలో శనివారం జరపాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా మాజీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అలాగే బీజేపీ, వామపక్ష పార్టీల నేతల తోపాటు సినీ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, రానా తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
అయితే తొలుత ఈ కార్యక్రమానికి నందమూరి తారక రామారావు మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ వస్తారని అందరూ భావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు ప్రకటించారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు, టూర్ దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్లు ఎన్టీఆర్ స్పష్టం చేశారు.
కాగా, ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రాలేకపోతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినప్పటికీ.. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న వేదికపైకి వచ్చేందుకు ఇష్టం లేకే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు. కనీసం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సమయాల్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా వీరెవరూ కలసి నివాళి అర్పించింది లేదు. ఇటీవల తారకత్న కర్మక్రియలు నిర్వహించిన సమయంలోనూ బాలకృష్ణ, ఎన్టీఆర్ ఎదురుపడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. దీన్నిబట్టి వారి మధ్య దూరం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. చంద్రబాబు, బాలకృష్ణతో మాటల్లేకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.