అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్
యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న బైడెన్ కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే.. అర్ధంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్‌కు బయలుదేరారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంటిలో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బైడెన్ బాధపడుతున్నారని పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బైడెన్ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన లాస్ వెగాస్‌లో ప్రచారంలో ఉండగా స్వల్ప లక్షణాలు కనిపించగా.. పరీక్షలు నిర్వహించారు. దీంతో కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని మీడియాకు వెల్లడించారు. బైడెన్ తన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తారని వైట్ హౌస్ తెలిపింది.
యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న బైడెన్ కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే.. అర్ధంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్‌కు బయలుదేరారు. అయితే ఆయన విమానం ఎక్కేటప్పుడు మాస్క్ ధరించకపోవడం గమనార్హం. తనతో ఉన్న విలేకరులతో తాను బాగానే ఉన్నట్టు వెల్లడించారు. ఇక బైడెన్ మంగళవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది.