చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు అవమానం.. మీడియా చూస్తుండగానే సభ నుంచి గెంటివేత
జింటావో అక్కడి నుంచి కదలడానికి ఆసక్తి చూపించలేదు. కానీ, చివరకు బలవంతంగా అక్కడి నుంచి చేతులు పట్టుకొని తీసుకెళ్లిపోయారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు హు జింటావోకు ఘోర అవమానం చోటు చేసుకుంది. సదస్సు జరుగుతున్న మెయిన్ హాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా అత్యున్నత నేతలందరితో పాటు ముందు వరుసలో కూర్చొని ఉన్న జింటావోను.. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి బలవంతంగా హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది చాలా సేపు జింటావోతో మాట్లాడారు. అతడిని బయటకు వెళ్లమని చెప్పారు. కానీ జింటావో అక్కడి నుంచి కదలడానికి ఆసక్తి చూపించలేదు. కానీ, చివరకు బలవంతంగా అక్కడి నుంచి చేతులు పట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఈ తతంగం జరుగుతున్నప్పుడు అధ్యక్షుడు జిన్‌పింగ్, చైనీస్ ప్రీమియర్ లీ కెకియాంగ్ పక్కనే ఉన్నా.. సైలెంట్‌గా ఉండటం గమనార్హం.
కాగా, హు జింటావో ఆరోగ్యం బాగాలేదని, ఆయన కొన్ని రోజుల నుంచి చాలా నీరసంగా ఉన్నారని.. ఎక్కువ సేపు హాల్‌లో కూర్చోలేరనే ఉద్దేశంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది పక్క రూమ్‌కు తీసుకెళ్లారని చైనా స్టేట్ మీడియా ప్రకటించింది. మరోవైపు జింటావోను బయటకు బలవంతంగా తీసుకెళ్లడానికి కొద్ది సేపటి క్రితమే అంతర్జాతీయ మీడియాను లోపలికి అనుమతించారు. ఇది కావాలనే చేసిన చర్య అని, జిన్‌పింగ్‌ను అత్యంత శక్తిమంతుడిగా మార్చే ప్రక్రియలో భాగంగా జరుగుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ కాంగ్రెస్‌లో తమ బలాన్ని చూపించడానికే అంతర్జాతీయ మీడియా ముందు ఈ డ్రామా ఆడినట్లు చర్చ జరుగుతున్నది.
సీనియర్లను తప్పించేసి..
వెస్ట్ మీడియా జిన్‌పింగ్‌ను ఎంత తక్కువ చేసి చూపాలని ప్రయత్నించినా.. సీపీసీపై తనకు ఎంత పట్టు ఉన్నదో ఆయన మరోసారి నిరూపించారు. జీవితకాలం చైనాను పాలించాలని ఇప్పటికే నిర్ణయించిన జిన్‌పింగ్.. ఆ దిశగా తనకు ఎవరూ అడ్డులేకుండా చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్లను ఒక్కొక్కరిగా పదవుల నుంచి తప్పించి వారికి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు. అధ్యక్షుడి తర్వాత స్థానంలో ఉండే చైనా ప్రీమియర్ (ప్రధాని) లీ కెకియాంగ్‌కు ఉద్వాసన పలికారు. ఆయనకు పోలిట్ బ్యూరోతో పాటు స్టాండింగ్ కమిటీలో కూడా చోటు ఇవ్వలేదు. ఆయనతో పాటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ లీ ఝాన్సు, చైనా పీపుల్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్ యాంగ్, ఉప ప్రధాని హాన్ జెంగ్‌లను కూడా ఇంటికి పంపించేశారు. వీరికి పొలిట్ బ్యూరో, స్టాండింగ్ కమిటీల్లో చోటు దక్కకపోవడంతో పదవులకు కూడా అర్హత కోల్పోయారు.
దేశ పాలనా వ్యవహారాల్లో కీలకమైన ఆ నలుగురు సీనియర్లను పక్కన పెట్టడం ద్వారా జిన్‌పింగ్ తన వర్గం వ్యక్తులను పొలిట్ బ్యూరో, స్టాండింగ్ కమిటీల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో మావో జెడాంగ్ తర్వాత చైనాకు అత్యంత శక్తివంతుడైన అధ్యక్షుడిగా జిన్‌పింగ్ మారనున్నారు. శనివారం చివరి రోజు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన 2,300 మంది సదస్సుకు హాజరయ్యారు. ఇందులో నుంచి 376 మందిని సెంట్రల్ కమిటీకి ఎన్నుకున్నారు. ఇవ్వాళ 376 మంది మరోసారి సమావేశం కానున్నారు.
ఆదివారం జరిగే సమావేశంలో 25 మంది పొలిట్ బ్యూరో సభ్యులను కమిటీ ఎన్నుకుంటుంది. ఈ 25 మంది పొలిట్ బ్యూరో సభ్యులు ఏడుగురితో కూడిన స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటుంది. ఇది అత్యున్నతమైన, అత్యంత శక్తివంతమైన కమిటీ. దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేది స్టాండింగ్ కమిటీనే. ఈ స్టాండింగ్ కమిటీ పార్టీ జనరల్ సెక్రటరీ (అధినేత) పేరును ప్రకటిస్తుంది. జిన్‌పింగ్‌కు మూడోసారి అప్పగించే ప్రతిపాదనకు ఇప్పటికే పూర్తి ఆమోదం లభించింది. ఆదివారం దీన్ని లాంఛనంగా ప్రకటిస్తారు.