ట్రంప్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడిన మోడీ
అమెరికాలో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి నేతల మధ్య ఇదే మొదటి సంభాషణ. ట్రంప్-మోడీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోడీ ఫోన్ కాల్‌లో అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.
ఇదిలా ఉండగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్.. కీలక పత్రాలపై సంతకాలు చేసి విషయం విదితమే.వీటిలో అమెరికాలో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్నభారతీయులకు జన్మించే సంతానంపై దీని ప్రభావం ఉంటుందన నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నది. మరోవైపు వీసా తీసుకోవడానికి 400 రోజులు ఎదురు చూడటం అనేది కీలకమైనదే. ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపెట్టడంతో పాటు వీసా ఆలస్యాల వల్ల వాణిజ్యం, పర్యాటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.