నాటో సైనిక కూటమిలో చేరడాన్నిఉక్రెయిన్ మరిచిపోవాలి
యుద్ధాన్ని ముగించడానికి పుతిన్‌తో త్వరలోనే భేటీ అవుతానని ట్రంప్ వెల్లడి
నాటో సైనిక కూటమిలో చేరడాన్ని ఉక్రెయిన్ ఇక మరిచిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో యుద్ధానికి అదే ప్రధాన కారణం అన్నారు. రేపు వైట్‌హౌస్‌కు జెలెన్‌స్కీ రానున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్నిముగించడానికి పుతిన్‌తో త్వరలోనే సమావేశమౌతానని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖనిజాల ఒప్పందంపై జెలెన్‌స్కీ రేపు సంతకం చేస్తారని వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏరోస్పేస్, రక్షణ, అణు పరిశ్రమల్లో వినియోగించే అరుదైన ఖనిజాలను తరలించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని చెప్పారు. రష్యాతో పోరాటానికి తాము చేసిన సాయానికి ఉక్రెయన్ కృతజ్ఞతాభావాన్ని చూపెట్టడానికి ఇదొక అవకాశమని అన్నారు. విస్తృత ఆర్థిక ఒప్పందం తుది రూపు సిద్ధమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అయితే అందులో తమ దేశానికి సంబంధించిన భద్రతాపరమైన హామీలను చేర్చలేదన్నారు. ఒప్పందం ఖరారు ట్రంప్‌తో జరిగే చర్చలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.