ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం
భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం
అమెరికా 47 అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ నేడు (సోమవారం) ప్రమాణం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నది. ట్రంప్ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. అక్కడి 100 మంది ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. వారిలో ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు కూడా ఉన్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో నేడు ఆయన ప్రమాణం చేయనున్నారు. సాధారణ క్యాపిటల్ హిల్ మెట్లపై అధ్యక్షులుగా ప్రమాణం చేస్తుంటారు. అయితే అతి శీతల వాతావరణం కారణంగా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 25 వేల మందితో ఫెడరల్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవ వేళ 'మేము గెలిచాం' అంటూ ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ర్యాలీకి చాలామంది స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు హాజరైనందుకు సంతోషం అన్నారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబుతున్నామన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా నాలుగు సంవత్సరాల అమెరికా క్షీణతకు తెరపడుతుందన్నారు. అమెరికన్ బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించనున్నామన్నారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానన్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. అంబానీ దంపతులు కూడా పాల్గొననున్నారు. అంబానీ కుటుంబానికి ట్రంప్ కుటుంబం ప్రత్యేకంగా ఆహ్వానం పంపిందని ఓ వార్త సంస్థ తెలిపింది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లు కూడా హాజరుకానున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను బైటికి పంపిస్తాని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని, మూడో ప్రపంచ యుద్దం రాకుండా ఆపేస్తాననని చెప్పారు.
చివర్లో ఓ పాటకు విలేజ్ డిస్కో గ్రూప్ స్టెప్పులేసింది. మ్యూజిక్ తగ్గట్లుగా తన ఐకానిక్ స్టెప్పులతో సభికులను అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్సాహపరిచారు. ఇక బైడెన్ ప్రభుత్వ నిర్ణయంతో శనివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్ యాప్ మూగబోయింది. తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టిక్‌టాక్ యాక్సెస్ పునరుద్ధరిస్తానని ట్రంప్ చెప్పారు. దీనిపై స్పందించిన చైనీస్ కంపెనీ భరోసా ఇచ్చిందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.