14 ఏళ్ల పాటు ప్రధానిగా చేసి.. సైకిల్‌పై సింపుల్‌గా ఇంటికి.. నెట్టింట ప్రశంసల జల్లు
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మార్క్ రుట్టే కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సింపుల్‌గా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు.
ఆయన నెదర్లాండ్స్ దేశ ప్రధానిగా 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. తాజాగా కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఆయన.. సైకిల్ తొక్కుకుంటూ సిబ్బందికి టాటా చెబుతూ తన సొంతింటికి వెళ్లిపోయారు. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్ వైరల్‌గా మారింది.
మార్క్ రుట్టే 2010లో తొలిసారి నెదర్లాండ్స్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా ఆయనే పదవిలో కొనసాగుతూ వచ్చారు. అయితే, వలసలను నియంత్రించే విధానంపై సంకీర్ణ ప్రభుత్వంలో అంగీకారం కుదరలేదు. దీంతో గతేడాది జూలైలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. రుట్టే ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ బాధ్యతలు కొనసాగించారు.
గతేడాది చివరలో నెదర్లాండ్స్‌లో ఎన్నికలు జరగగా, మళ్లీ ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. దీంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ప్రధాని పీఠంపై ఏకాభిప్రాయం కుదరడంలో ఆలస్యమైంది. చివరకు గత మంగళవారం డిక్ స్కూఫ్ అధికారికంగా ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టారు.
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మార్క్ రుట్టే కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సింపుల్‌గా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు. సైకిల్ నడుపుకుంటూ సిబ్బందికి టాటా చెబుతూ వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియోను రిటైర్డ్ పోలీసు అధికారి, పుదుచ్చేరి మాజీ గవర్నర్ కిరణ్ బేడీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో మార్క్ రుట్టేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికార మార్పిడి ఇలా శాంతియుతంగా, ఆనందంగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.