పెళ్లికి ముందు శృంగారం చేస్తే జైలుకే.. వివాహేతర సంబంధాలకూ అదే శిక్ష
వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదా భర్త ఫిర్యాదు చేయవచ్చు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోయేషియాలో ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. పెళ్లికి ముందే శృంగారం చేసినా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా క్రిమినల్ కేసులు బుక్ చేసి, జైలుకు పంపే చట్టాన్ని తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఇది కేవలం ఆ దేశ ప్రజలకే కాకుండా, పర్యాటకం నిమిత్తం వచ్చే విదేశీయులకు కూడా అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఒక రకంగా ఇది ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల జీ-20 దేశాల సదస్సును నిర్వహించి ఇండోనేషియా వార్తల్లో నిలిచింది. అక్కడి బాలీలో ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు జరిగాయి. గత నెలాఖరు వరకు ఇండోనేషియానే జీ-20 అధ్యక్ష హోదాలో ఉన్నది. అయితే అప్పటికే ఈ చట్టంపై నిర్ణయం తీసుకున్నా.. జీ-20 సమావేశాలు జరుగుతుండంతో బయటకు పొక్కనీయలేదు. ఆ విషయం తెలిస్తే ఇతర దేశాలు అభ్యంతరం చెప్తాయనే అనుమానంతో బయటకు తెలియనీయలేదు. ఇక్కడ ముస్లిం చట్టాలు కఠినంగా అమలు చేస్తుంటారు. మహిళల, మైనార్టీలు, స్వలింగ సంపర్కులపై అనేక చట్టాలు అమలులో ఉన్నాయి. తాజాగా ఈ చట్టం కూడా అమలు కాబోతోంది.
ఇండోనేషియాకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బాలీ ఒక అంతర్జాతీయ పర్యాటక నగరంగా ఉన్నది. విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడి సముద్రతీర ప్రాంతాల్లో గడిపేందుకు వస్తుంటారు. అక్కడ భారీ పార్టీలు కూడా జరుగుతుంటాయి. బాలీ నైట్ లైఫ్ అంటే ఎంతో మంది మోజు చూపిస్తుంటారు. ఆ దేశ జీడీపీలో ఐదు శాతం పర్యాటకం ద్వారానే వస్తుంది. ఏటా 1.50 కోట్ల మంది పర్యటకులు ఇండోనేషియాను సందర్శిస్తుంటారు. దాదాపు 1800 కోట్ల డాలర్ల ఆదాయం పర్యాటకం ద్వారా సమకూరుతోంది. ప్రేమ జంటలు ఎక్కువగా బాలి వస్తుంటాయని ఒక అధ్యయనంలో కూడా తేలింది.
తాజాగా వివాహం కాని వ్యక్తులు శృంగారం చేస్తే అది వ్యభిచారంగా పరిగణించి క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని ఇండోనేషియా ప్రభుత్వం చెబుతోంది. ఇది తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టాలు కనుక అమలు అయితే పర్యాటకంపై దెబ్బ పడుతుందని అంటున్నారు. అయినా సరే అధ్యక్షుడు జోకో విడోడో డిసెంబర్ 15న చట్టానికి ఆమోదం తెలుపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎవరైనా వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయితే ఏడాది జైలు, భారీ జరిమానా విధిస్తారు. వివాహేతర సంబంధానికి కూడా ఇలాంటి శిక్షలే ఉంటాయి. మానవ హక్కుల సంఘంతో భేటీ అయిన తర్వాతే బిల్లు రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదా భర్త ఫిర్యాదు చేయవచ్చు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇండోనేషియా రాజ్యాంగం ఆర్టికల్ 144 ప్రకారం కోర్టులో విచారణకు ముందే ఫిర్యాదు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నది. దురుద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేస్తారనే ఇలాంటి చట్టం ఒకటి అమలు చేస్తున్నారు. అయితే తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. మరోవైపు ఇష్టపడి శృంగారం చేసుకునే వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విదేశాల నుంచి భార్యో, భర్తో, తల్లిదండ్రులో వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రజలకు వర్తిస్తే ఓకే.. కానీ విదేశీయులకు ఎందుకు ఈ చట్టమని అంటున్నారు. మరి ప్రభుత్వం విదేశీయుల పట్ల వెసులు బాటు ఇస్తుందో లేదో చూడాలి.