పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చారని.. ఉద్యోగులపై వేటు

గాజాలోని హమాస్ శిబిరాలపై ఇజ్రాయేల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా బిజినెస్ స్కూల్స్‌కు చెందిన కొందరు విద్యార్థులు సంతకాల సేకరణ చేశారు.

Advertisement
Update:2023-10-19 18:15 IST

ఇజ్రాయేల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాలస్తీనియన్లకు మద్దతుగా ఎవరైనా సంఘీభావం ప్రకటించినా, ర్యాలీలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావం తెలియజేయగా.. వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ర్యాలీలు, నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పాలస్తీనియన్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే కారణంతో అమెరికాలో ఉద్యోగులపై వేటు వేశారు.

గాజాలోని హమాస్ శిబిరాలపై ఇజ్రాయేల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా బిజినెస్ స్కూల్స్‌కు చెందిన కొందరు విద్యార్థులు సంతకాల సేకరణ చేశారు. దీంతో ఆయా విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేస్తున్న సంస్థలు తీవ్రంగా పరిగణించాయి. హార్వర్డ్‌లో చదువుతున్న ముగ్గురు, కొలంబియాలో చదువుతున్న ఒకరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వాళ్లు ఆయా సంస్థల్లో పార్ట్ టైంగా మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే వారి పేర్లను మాత్రం ఆ సంస్థలు వెల్లడించలేదు.

అమెరికాలోని పలు సంస్థలు, వ్యాపారవేత్తలు, సీఈవోలు కీలక ప్రకటనలు చేశారు. ఇజ్రాయేల్, హమాస్‌ పరిణామాలపై తమ ఉద్యోగులు ఎలాంటి వ్యాఖ్యలు, నిరసనలు చేపట్టవద్దని హెచ్చరించాయి. నిబంధనలు ఉల్లంఘించి ఏ వర్గానికి మద్దతు ఇచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని చెప్పాయి. అయినా సరే కొంత మంది ఉద్యోగులు, విద్యార్థులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు.

డేవిస్ పోక్ అండ్ డార్వెల్ అనే న్యాయ సంస్థ ముగ్గురిపై వేటు వేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంతటి చర్యలకైనా వెనుకాడబోమని సదరు సంస్థ పేర్కొన్నది. అంతే కాకుండా తమ ఉద్యోగులు చేస్తున్న కామెంట్లు, నిరసనలతో మాకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటన వెలువరించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు హమాస్ చర్యలే కారణమని సదరు సంస్థ పేర్కొనడం గమనార్హం.


Tags:    
Advertisement

Similar News