రష్యాలోనూ అమ్మఒడి.. కండిషన్స్ అప్లై..

పిల్లల్ని బడికి పంపించడానికి తల్లులకు అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.

Advertisement
Update:2022-08-19 09:22 IST

పిల్లల్ని బడికి పంపించడానికి తల్లులకు అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇలాగే పిల్లల పోషణకోసం రష్యా ప్రభుత్వం కూడా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఇందులో చాలా కండిషన్లున్నాయి. ఒక్కో తల్లి 10మంది పిల్లల్ని కనాలి. పదో బిడ్డ మొదటి పుట్టినరోజున పెద్దమొత్తంలో ఆర్థిక సాయం అందుతుంది. భారత కరెన్సీలో 13లక్షల రూపాయలు అంటే 10లక్షల రష్యా రూబుళ్లను అక్కడి ప్రభుత్వం ఆ తల్లికి అందిస్తుందనమాట.

మదర్ హీరోయిన్..

10మంది పిల్లల్ని కన్న తల్లికి 10 లక్షల రూబుళ్లు ఇవ్వడంతోపాటు.. మదర్ హీరోయిన్ అనే బిరుదు కూడా ఇస్తారు. రష్యా, సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నప్పుడు ఇలాంటి పథకమే అమలులో ఉండేది. అప్పట్లో దాదాపు 4 లక్షలమంది మదర్ హీరోయిన్లు ఉన్నారట. వారందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించారు. మళ్లీ ఇప్పుడు దీన్ని తెరపైకి తెచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఎందుకిదంతా..?

కేవలం జనాభాను పెంచడం కోసమే పుతిన్ ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. రష్యా జనాభా రానురాను తగ్గిపోతోంది. యువకుల సంఖ్యకంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశముంది అందుకే సోవియట్‌ కాలం నాటి పథకాన్ని తిరిగి తీసుకొస్తున్నారు పుతిన్. పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు.

అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా..

1944లో అప్పటి సోవియట్‌ అధినేత జోసెఫ్‌ స్టాలిన్‌ ఈ అవార్డు ప్రవేశపెట్టారు. దాదాపు 4 లక్షల మంది తల్లులకు దీన్ని అందజేశారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ అంతరించాక ఈ పథకం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. తాజాగా రష్యాలో సంతాన సాఫల్యత తగ్గడం, మరణాలు పెరగడం, వలసలు పెరిగిపోవడంతో జనాభా తగ్గింది. ఉక్రెయిన్‌ పై సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత 15 వేల మంది రష్యా సైనికులు మృతిచెంది ఉంటారని అంచనా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్‌ ఆనాటి అవార్డును వెలుగులోకి తీసుకొచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నగదు పురస్కారం కోసం 10మంది పిల్లలకు జన్మనిచ్చి, వారిని పోషించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు మూడు కాన్పులకే మహిళల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్న కాలం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు 10 కాన్పులు తట్టుకోవడం కష్టసాధ్యమేనంటున్నారు నిపుణులు. మరి ఈ తరం మదర్ హీరోయిన్లు ఎవరో తేలాలంటే ఎన్నాళ్లు వేచి చూడాలో.

Tags:    
Advertisement

Similar News